NZ v SA: 7 టెస్టుల్లో 7 సెంచరీలు.. ఆల్‌టైం రికార్డ్ బ్రేక్ చేసిన విలియంసన్

NZ v SA: 7 టెస్టుల్లో 7 సెంచరీలు.. ఆల్‌టైం రికార్డ్ బ్రేక్ చేసిన విలియంసన్

కొడితే కొట్టాలిరా సెంచరీ కొట్టాలి.. ఈ వాక్యం న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు విలియంసన్ కు బాగా సరిపోతుంది. టెస్టుల్లో ఒక సెంచరీ కొట్టడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కివీస్ బ్యాటర్ మాత్రం సెంచరీల వర్షం కురిపిస్తున్నాడు. సింగిల్ తీసినంత సింపుల్ గా సెంచరీలు బాదేస్తున్నాడు. తాజాగా దక్షిణాఫ్రికాపై మరో సెంచరీ చేసి రెండు ఆల్ టైం రికార్డ్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. చివరి 7 టెస్టుల్లో ఇది ఏడో సెంచరీ కావడం విశేషం. 13 ఇన్నింగ్స్ ల వ్యవధిలోనే 7 సెంచరీలు బాదేశాడు.
 
శుక్రవారం(ఫిబ్రవరి 16) దక్షిణాఫ్రికాతో హామిల్టన్‌లో జరిగిన రెండో టెస్టులో  విలియంసన్ సెంచరీ చేసి అత్యంత వేగంగా 32 టెస్టు సెంచరీలు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవెన్ స్మిత్ (174 ఇన్నింగ్స్‌లు)ను అధిగమించి అత్యంత వేగంగా 32 టెస్టు సెంచరీలు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. కేన్ 172వ ఇన్నింగ్స్‌లోనే ఈ మార్కును అందుకున్నాడు. ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ (176), క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ (179) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఈ సెంచరీతో టెస్టు మ్యాచ్‌లో నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ గా పాకిస్థాన్ బ్యాటర్ యూనిస్ ఖాన్ (5) పేరిట ఉన్న రికార్డ్ ను సమం చేశాడు. ఆరో సెంచరీ నమోదు చేసి న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన జాక్వెస్ కలిస్‌ రికార్డ్ ను సమం చేశాడు. 33 ఏళ్ల ఈ కివీస్ బ్యాటర్ ఈ సిరీస్ లోని మొదటి టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌లలో (118,109) సెంచరీలు  చేసిన సంగతి తెలిసిందే. విలియంసన్ సెంచరీతో 267 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ఈ మ్యాచ్ లో విజయం దిశగా దూసుకెళ్తుంది.