జనగామలో టెన్షన్.. టెన్షన్

జనగామలో టెన్షన్.. టెన్షన్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర నేపథ్యంలో జనగామలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అల్లర్లు జరుగుతాయన్న సాకుతో నెల్లుట్ల - జనగామ రోడ్డులోని11 వైన్స్, 5 బార్లు మూసివేశారు. సాయంత్రం 5గంటలకు జనగామ చౌరస్తాలో బీజేపీ సభ జరగనుండగా.. ఆ సమయానికి వ్యాపార సముదాయాలను కూడా మూసివేయించేందుకు పోలీసులు సిద్ధమయ్యారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో పాలకుర్తి పాదయాత్ర  సందర్భంలోనూ పోలీసులు వ్యాపార సంస్థలు, షాపులను మూసివేయించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. సభకు జనం రావొద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర జనగామలో కొనసాగుతోంది. జనగామ చౌరస్తాలో జరగనున్న సభ నేపథ్యంలో బీజేపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ నేతలు కూడా పోటీగా ఫ్లెక్సీలు పెట్టారు. అంతటితో ఆగకుండా బీజేపీ ఫ్లెక్సీలను చించేశారు. మరోవైపు తమ ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతే.. పాదయాత్ర కొనసాగించాలంటూ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రశ్నావళితో ప్లెక్సీలు, హోర్డింగ్స్ ఏర్పాటు చేసి సవాల్ విసరడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.