
- శనివారం అర్ధరాత్రి వరకు 86 వేల అప్లికేషన్లు,
- దరఖాస్తులకు గడువు పొడిగింపు.. ఈ నెల 23 వరకు చాన్స్
- 27న లక్కీ డ్రా.. బీసీ బంద్, బ్యాంకులకు సెలవులతో
- గడువు పెంచుతున్నట్టు అధికారుల వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఈ సారి వైన్స్ అప్లికేషన్లు తగ్గాయి. 2023లో 1.31 లక్షల దరఖాస్తులు రాగా, ఈసారి లక్ష లోపే వచ్చాయి. రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాలకు గత నెల 26 నుంచి ఈ నెల 18 వరకు అప్లికేషన్లు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా శనివారం రాత్రి 11 గంటల వరకు 86 వేల అప్లికేషన్లు వచ్చాయి. అయితే ఇంకా చాలామంది అప్లికేషన్లు ఇచ్చేందుకు క్యూ లైన్లో ఉండటంతో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అధికారులు తెలిపారు. దాదాపు 90 వేల నుంచి 95 వేల వరకు అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఒకవేళ 90 వేల పైన అప్లికేషన్లు దాటితే ప్రభుత్వ ఖజానాకు దరఖాస్తుల ద్వారానే రూ.2,700 కోట్ల ఆదాయం సమకూరుతుంది. ఒక్కో వైన్స్‌కు వందల్లో అప్లికేషన్లు వచ్చాయి.
కూడబలుక్కుని అప్లికేషన్లు..
ఎలాగైనా వైన్స్ ను దక్కించుకోవాలని భావించిన కొందరు.. వారి ప్రాంతాల్లో 10 మంది కలిసి రెండు, మూడు మద్యం దుకాణాలకు అప్లికేషన్లు సమర్పించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు వారి దగ్గరి బంధువులతో ఎక్కువ అప్లికేషన్లు వేయించారు. రియల్టర్లు.. ఇప్పటికే వైన్స్‌లు నిర్వహిస్తున్నోళ్లు కూడా రకరకాలుగా అప్లికేషన్లు వేశారు. ఎక్కడో ఒక చోట తమకు అదృష్టం కలిసిరాకపోతుందా అని భావించి చాలామంది రెండు, మూడు అప్లికేషన్లు వేశారు.
27న లక్కీ డ్రా..
ఈ నెల 27న లాటరీ పద్ధతిలో దుకాణాలు కేటాయించనున్నారు. 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు రెండేండ్ల కాలానికి ఎక్సైజ్ శాఖ కొత్త లైసెన్సులు జారీ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,620 దుకాణాల్లో గౌడ్స్‌కు 393, ఎస్సీలకు 262, ఎస్టీలకు 131 చొప్పున కేటాయించారు. వైన్స్దక్కించుకున్నోళ్లు ఈ నెల 25 వరకు లైసెన్స్ ఫీజులో ఫస్ట్ ఇన్ స్టాల్ మెంట్ చెల్లించాల్సి ఉంటుంది. నవంబర్30 నుంచి కొత్త దుకాణాలకు స్టాక్ రిలీజ్ చేస్తారు. డిసెంబర్ ఒకటి నుంచి కొత్త దుకాణాలు అందుబాటులోకి వస్తాయని ఇప్పటికే ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది.
గతం కంటే తగ్గినయ్..
రాష్ట్రవ్యాప్తంగా 2,620 వైన్స్ ఉన్నాయి. ఒక్క అప్లికేషన్‌కు రూ.3 లక్షల ఫీజు తీసుకున్నారు. ఇది నాన్‌రిఫండబుల్. 2023లో వచ్చిన అప్లికేషన్ల సంఖ్య 1.31 లక్షలుగా ఉన్నది. దీంతో ఈసారి దాదాపు 40 వేల అప్లికేషన్లు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక అంతకుముందు మద్యం పాలసీ 2021లో 67,849 అప్లికేషన్లు వచ్చాయి. ఫీజు రూ.లక్ష పెంచడంతో ఈసారి అప్లికేషన్లు తగ్గినా, ఆదాయం పోయినసారి అంతే వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇక ఇప్పుడు దీనికి తోడు ఫస్ట్ఇన్స్టాల్మెంట్కూడా వస్తుంది. ఈ మొత్తం కూడా కలిపితే ఆదాయం ఇంకింత పెరగనుంది. ఒక్కో మద్యం దుకాణానికి సగటున 40 అప్లికేషన్లు వచ్చాయి. గతంలో ఏపీ సరిహద్దు ప్రాంతాలలో ఎక్కువ అప్లికేషన్లు రాగా ఈసారి తగ్గింది. పైగా ఇంతకు ముందు ఏపీ రాష్ట్రంలో ప్రభుత్వమే వైన్స్‌లను నిర్వహించింది. ఈసారి కూడా అక్కడ వైన్స్‌లకు తెలంగాణ మాదిరి అప్లికేషన్ల సిస్టమ్పెట్టడంతో ఏపీ వ్యాపారులు అక్కడే అప్లికేషన్లు వేశారు. దీంతో తెలంగాణలో ఈసారి అప్లికేషన్ల సంఖ్య తగ్గినట్లు తెలుస్తోంది. అప్లికేషన్ఫీజు పెంచడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. సరూర్‌నగర్, శంషాబాద్, నల్గొండ, మేడ్చల్‌లో ఎక్కువ అప్లికేషన్లు వచ్చాయి. నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో తక్కువగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.