
- మొత్తం ఆదాయం రూ.22,205 కోట్లు
- షేరుకి రూపాయి డివిడెండ్‌ను ప్రకటించిన కంపెనీ
న్యూఢిల్లీ : ఐటీ కంపెనీ విప్రో గత ఏడాది డిసెంబరుతో ముగిసిన మూడవ క్వార్టర్లో రూ.2,700 కోట్ల లాభం, రూ.22,205 కోట్ల ఆదాయం సంపాదించింది. కంపెనీ డీల్ బుకింగ్ ఊపందుకుంది. తమ పెద్ద ఒప్పందాలు సంవత్సరానికి 20 శాతం పెరిగాయని, క్యాప్కో వ్యాపారంలో ఆర్డర్ బుకింగ్‌లలో రెండంకెల వృద్ధి ఉందని విప్రో సీఈఓ మేనేజింగ్ డైరెక్టర్ థియరీ డెలాపోర్టే అన్నారు. విప్రో క్యూ3 స్కోర్ కార్డ్ ఇలా ఉంది.
1. కార్యకలాపాల ద్వారా విప్రో కన్సాలిడేటెడ్ ఆదాయం వార్షికంగా 4.4 శాతం , సీక్వెన్షియల్‌గా 1.4 శాతం క్షీణించి రూ.22,205.1 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే క్వార్టర్లో విప్రో ఆదాయం రూ.23,229 కోట్లు కాగా, క్యూ2లో ఈ ఐటీ సంస్థ ఆదాయం రూ.22,515.9 కోట్లు. ఐటీ సేవల విభాగం ఆదాయం సీక్వెన్షియల్‌గా 2.1 శాతం తగ్గి 2,656.1 మిలియన్ డాలర్లకు చేరుకుంది.
2. తాజా క్వార్టర్లో విప్రో కన్సాలిడేటెడ్ లాభం రూ.2,700.6 కోట్లకు చేరుకుంది. ఇది సీక్వెన్షియల్‌గా 1.2 శాతం పెరిగింది, కానీ వార్షికంగా 11.9 శాతం తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్ కంపెనీ లాభం రూ.2,667.3 కోట్లు. మూడో క్వార్టర్లో రూ.3,065 కోట్లుగా ఉంది.
3. విప్రో తన ఐటీ సేవల వ్యాపార విభాగం నుంచి రాబడి నాలుగో క్వార్టర్లో 2,615 మిలియన్ డాలర్ల నుంచి 2,669 మిలియన్ డాలర్ల పరిధిలో ఉండొచ్చని అంచనా వేస్తోంది. ఇది స్థిరమైన కరెన్సీ టర్మ్స్‌లో -1.5 శాతం నుంచి +0.5 శాతం వరకు సీక్వెన్షియల్ గైడెన్స్‌కి సమానం.
4. క్వార్టర్లో మొత్తం బుకింగ్‌లు విలువ 3.8 బిలియన్ డాలర్లు కాగా, ఇవి సీక్వెన్షియల్‌గా 0.2 శాతం పెరిగాయి. పెద్ద డీల్ బుకింగ్‌లు విలువ 0.9 బిలియన్ డాలర్లు. పెద్ద డీల్ బుకింగ్‌లు మొత్తం కాంట్రాక్ట్ విలువలో 30 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఉంటాయి.
5. క్వార్టర్లో ఐటీ సేవల విభాగం ఈబీఐటీ రూ.3,540 కోట్లు (425.8 మిలియన్ డాలర్లు) ఉంది. ఇది సీక్వెన్షియల్‌గా 1.8 శాతం తగ్గింది.
6. క్వార్టర్లో ఐటీ సేవల నిర్వహణ మార్జిన్ 16 శాతం వద్ద ఉంది. సీక్వెన్షియల్‌గా 11 బేసిస్ పాయింట్లు తగ్గింది.
7. క్వార్టర్లో ఒక్కో షేరు ఆదాయం సీక్వెన్షియల్‌గా 2 శాతం పెరిగి రూ.5.16 వద్ద ఉన్నాయి.
8. నిర్వహణ నగదు ప్రవాహం నికర ఆదాయంలో 177.3 శాతంగా ఉంది.
దీని విలువ రూ.4,790 కోట్లు (575.7 మిలియన్ డాలర్లు).
9. వాలంటరీ అట్రిషన్ (రాజీనామాలు) సీక్వెన్షియల్‌గా మోడరేట్‌గా ఉంది. మూడో క్వార్టర్లో10 -క్వార్టర్ల కనిష్ట స్థాయి 12.3 శాతంగా ఉంది.
10. షేరుకు రూపాయి డివిడెండ్ ప్రకటించింది.
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లాభం రూ. 4,351 కోట్లు
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ నికరలాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్లో 6.23 శాతం పెరిగి రూ. 4,351 కోట్లకు చేరుకుంది. అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంలో రూ. 4,096 కోట్లుగా ఉంది. నోయిడాకు చెందిన ఈ ఐటీ కంపెనీ మొత్తం ఆదాయం గత ఏడాది ఇదే కాలంలో రూ.26,960 కోట్ల నుంచి రూ.28,816 కోట్లకు పెరిగింది. మార్కెట్ తర్వాత ఇది ఫలితాలను ప్రకటించింది.
అంతకుముందు రోజు హెచ్‌సీఎల్ టెక్ షేర్లు 3.85 శాతం లాభంతో రూ.1,543 వద్ద స్థిరపడ్డాయి. హెచ్‌సీఎల్ టెక్ బోర్డు 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.రెండు విలువ గల ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.12 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. డివిడెండ్‌ను చెల్లించడానికి జనవరి 20 రికార్డ్ తేదీగా నిర్ణయించబడింది. చెల్లింపు తేదీ జనవరి31 అవుతుంది. మూడవ క్వార్టర్లో కంపెనీ 18 పెద్ద ఒప్పందాలను గెలుచుకున్నట్లు పేర్కొంది. తాజా క్వార్టర్లో 3,617 మంది ఉద్యోగులతో పాటు మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,24,756గా ఉందని హెచ్‌సీఎల్ తెలిపింది.