హ్యాపీ బర్త్ డే రాహుల్ ద్రవిడ్

హ్యాపీ బర్త్ డే రాహుల్ ద్రవిడ్

భారత క్రికెట్‌కు అందించిన అత్యుత్తమ ఆటగాళ్లలో రాహుల్ ద్రవిడ్ ఒకరు. టీమిండియాకు 16 ఏళ్ల పాటు సేవలందించిన రాహుల్ ద్రవిడ్‌ను అభిమానులు ద వాల్, మిస్టర్ డిపెండ‌బుల్, కెప్టెన్ కూల్‌గా పిలుచుకుంటారు. శనివారం ద్రవిడ్ తన 47వ పుట్టిన‌రోజును జరుపుకున్నాడు.

ఈ సందర్భంగా మాజీ క్రికెటర్లతో పాటు ప్రస్తుత క్రికెటర్లు ద్రవిడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ద్రవిడ్ మొత్తం 24,208 ప‌రుగులు నమోదు చేశాడు. క్రికెట్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన ఆరో బ్యాట్స్‌మ‌న్‌గా రికార్డు నమోదు చేశాడు.

టెస్టుల్లో 13288 పరుగులు చేశాడు. ఇందులో 36 సెంచరీలు ఉన్నాయి. ఇక వన్డేల్లో 86 హాఫ్ సెంచరీలు చేసిన ద్రవిడ్ 2003 నుంచి 2007 వరకు టీమ్ కెప్టెన్సీ బాధ్యతలు కూడా చేపట్టాడు. వన్డే ఫార్మాట్‌లో అత్య‌ధిక హాఫ్ సెంచ‌రీలు చేసిన‌వారిలో నాలుగోస్థానంలో ఉన్నాడు. క్రికెట్‌కు చేసిన సేవలకు గాను 2013లో కేంద్ర ప్రభుత్వం ద్రవిడ్‌ని పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది.

అంతేకాదు 2004లో ఐసీసీ ప్రకటించిన ఐసీసీ టెస్టు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో పాటు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని రాహుల్ ద్రవిడ్ సొంతం చేసుకున్నాడు. ఈ అవార్డు అందుకున్న తొలి భారత క్రికెట్ ద్రవిడ్. ప్రస్తుతం నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ(ఎన్‌సీఏ) డైరెక్టర్‌గా కొనసాగుతున్న ద్రవిడ్‌కు బీసీసీఐ ప్రత్యేకంగా బర్త్ డే శుభాకాంక్షలను ట్విట్టర్‌ ద్వారా తెలిపింది.