
హైదరాబాద్, వెలుగు: దుబ్బాక బై పోల్‌లో బీజేపీ గెలుపుతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ క్యాడర్‌లో జోష్ పెరిగింది. ఈ రిజల్ట్‌తో టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని బీజేపీ రుజువు చేసుకుంది. దీంతో టీఆర్ఎస్, కాంగ్రెస్, ఇతర పార్టీల్లోని అసంతృప్తి నేతల చూపు బీజేపీపై పడింది. ఇంతకాలం మౌనంగా ఉన్న వేరే పార్టీల నేతలు ఇప్పుడు కమలం గూటికి ‘క్యూ’ కట్టేందుకు రెడీ అవుతున్నారు.
ఎంపీ ఎన్నికల్లో 4 సీట్ల గెలుపుతో..
2019 లోక్‌సభ ఎన్నికల ముందు రాష్ట్రంలో బీజేపీలోకి వలసలు భారీగా పెరిగాయి. కాంగ్రెస్ నుంచి డీకే అరుణ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి వంటి సీనియర్ నేతలు పార్టీలో చేరారు. ఆ తర్వాత ఎంపీ ఎన్నికల్లో బీజేపీ 4 సీట్లు గెలుపొందడం, కాంగ్రెస్ 3 సీట్లకే పరిమితం కావడంతో రాష్ట్రంలో బీజేపీకి మంచి ఊపొచ్చింది. ఈ గెలుపుతో రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని బీజేపీ నేతలు చెబుతూ వచ్చారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీలకు చెందిన పలువురు సీనియర్ నేతలు రాష్ట్రంలో బీజేపీదే భవిష్యత్ అని గుర్తించి పార్టీలో చేరారు. తాజాగా దుబ్బాక ఉప ఎన్నిక రిజల్ట్‌తో టీఆర్ఎస్, కాంగ్రెస్‌లోని అసంతృప్తివాదులకు బీజేపీ ప్రత్యామ్నాయ పార్టీగా కనిపిస్తోంది. కమలదళంలో చేరేందుకు ఆయా పార్టీల నేతలు ఆలోచనలు చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి నటి విజయశాంతి, టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి వంటి వాళ్లు బీజేపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇతర పార్టీల సీనియర్లూ బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఈ రిజల్ట్‌తో మరింత మెరుగయ్యాయి.