దర్శకుడి మరణంతో తండ్రి లేని బిడ్డలా కేజేక్యూ మూవీ: దీక్షిత్ శెట్టి 

దర్శకుడి మరణంతో తండ్రి లేని బిడ్డలా కేజేక్యూ మూవీ: దీక్షిత్ శెట్టి 

దీక్షిత్ శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజా లీడ్ రోల్స్‌‌‌‌లో  నటించిన చిత్రం ‘కేజేక్యూ’  (కింగ్ జాకీ క్వీన్). ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌వీ సినిమాస్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై  సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన కేకే  గత ఏడాది కన్నుమూశారు. ఆయనకు  సినిమాపై ఉన్న  ప్యాషన్, విజన్‌‌‌‌కి నివాళిగా ఆగస్టు 7న ఈ చిత్రాన్ని  ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సోమవారం ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. 

ఈ సందర్భంగా దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ ‘తెలుగు ఆడియెన్స్ నన్ను ఎంతగానో ఆదరించారు.  ప్రతి సినిమా రిలీజ్ సమయంలో ఒక ఎక్సయిట్‌‌‌‌మెంట్, ఒక భయం ఉంటుంది. కానీ ఈసారి మాత్రం చాలా బాధగా ఉంది.  సినిమా విడుదల సమయంలో దర్శకుడు మన మధ్య లేకపోవడం.. సినిమా తండ్రి లేని కొడుకులా అనిపిస్తోంది. సినిమా గురించి ఏదైనా అడగాలన్నా, ఏదైనా తెలుసుకోవాలన్నా ఎవరిని అడగాలనే ప్రశ్న మా టీమ్ అందరిలో ఉంది. 

అయితే  శ్రీకాంత్ గారు, నిర్మాత సుధాకర్ గారు మాకు అండగా నిలబడ్డారు. అవుట్‌‌‌‌పుట్ బాగా వచ్చింది. ఎవరినీ నిరాశపరిచేలా ఉండదు. ఇందులోని పాత్రలు గుర్తుండిపోతాయి’ అని చెప్పాడు. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఉండే చిత్రమిది అని శశి అన్నాడు. తన కెరీర్‌‌‌‌లో ఇది చాలా మెమొరబుల్ క్యారెక్టర్ అని, నటిగా ఎంతో సంతృప్తిని ఇచ్చిన సినిమా అని యుక్తి తరేజా చెప్పింది.