బియ్యం బస్తా మోసి ఛాంపియన్ అయింది

బియ్యం బస్తా మోసి ఛాంపియన్ అయింది

తండ్రి, మేనమామ ప్రోత్సాహంతో వెయిట్​లిఫ్టింగ్​లో మెళకువలు నేర్చుకుంది. రెండేండ్ల క్రితం ఖేలో ఇండియా యూత్ గేమ్స్​లో అండర్–17 గర్ల్స్ టైటిల్  గెలిచి వార్తల్లోకెక్కింది. ఇప్పుడు గ్రీస్​లోని హెరాక్లియోన్ సిటీలో జరుగుతున్న జూనియర్ వరల్డ్ ఛాంపియన్​షిప్​లో బంగారు పతకం గెలిచింది. ఈ పోటీల్లో వెయిట్​లిఫ్టింగ్​లో గోల్డ్​మెడల్ సాధించిన మొదటి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది. పేరు హర్షద శరద్​ గరుడు. ఈ బంగారు పతకం వెనుక ఆమె పట్టుదలతో పాటు యాభై కిలోల బియ్యం బస్తా కథ కూడా ఉంది. 

ఈ ఏడాది జూనియర్ వరల్డ్ ఛాంపియన్​షిప్ పోటీల్లో 49 కిలోల విభాగంలో పోటీ పడింది హర్షద. ఫైనల్లో 70 కిలోల స్నాచ్​లో మొత్తం153 కిలోల బరువు ఎత్తి మొదటి స్థానంలో నిలిచింది. ఈ పోటీల్లో పతకం గెల్చిన మొదటి భారతీయురాలు తనే. హర్షద తండ్రి శరద్​  వెయిట్​లిఫ్టింగ్​లో స్టేట్ లెవల్ వరకు వెళ్లాడు. ఆమె మేనమామ కూడా వెయిట్​ లిఫ్టరే. ఇద్దరూ అంతర్జాతీయ స్థాయిలో పతకాలు గెలవాలి అనుకున్నారు. కానీ, వాళ్ల కల నెరవేరలేదు. దాంతో, హర్షదను వెయిట్​లిఫ్టర్​ని చేసి, తమ కలను నిజం చేసుకోవాలి అనుకున్నారు ఇద్దరు.  

హర్షద పేరు వెనుక...
హర్షద సొంతూరు పుణేలోని మావల్. తనకు ‘హర్షద’ అని పేరుపెట్టడానికి కూడా ఒక కారణం ఉంది... మహారాష్ట్రలో వెయిట్​లిఫ్టింగ్​కు పేరు పొందిన ఊర్లలో ఇదొకటి. ఈ ఊరికి చెందిన 73 ఏండ్ల బిహారీలాల్ దూబే జిమ్ ఒకటి​ ఏర్పాటు చేశాడు. అందులో ఆయన కోడలు హర్షద, శరద్​ వెయిట్​లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేసేవాళ్లు. దూబే కోడలు  నేషనల్ పోటీల్లో గోల్డ్ మెడల్ గెల్చినప్పుడు ఆమె విజయాన్ని ఊరంతా పెద్ద పండుగలా చేసుకోవడం శరద్​కు బాగా గుర్తుంది. ‘‘నాకు మొదటగా పుట్టిన ఆడబిడ్డకు హర్షద అని పేరుపెట్టాలని ఆ రోజే  అనుకున్నా. నా బిడ్డ  వెయిట్​లిఫ్టర్ అవుతుందని, మనదేశం తరఫున విదేశాల్లో పోటీపడుతుందని నమ్మేవాడిని. ఇప్పుడు ఆ రోజు రానే వచ్చింది” అని సంతోషంతో చెప్తాడు హర్షద తండ్రి శరద్​.   

ఆరేండ్ల క్రితం ఒకరోజు...
అప్పుడు హర్షదకు 12 ఏండ్లు. ఒకరోజు వాళ్ల నాన్న  యాభై కిలోల బియ్యం బస్తాల్ని ఇంట్లోకి తెచ్చేందుకు ఇబ్బంది పడుతుండడం చూసింది. నాన్నకు సాయం చేద్దామని ఒక బియ్యం బస్తాని ఎత్తి,  వీపు మీద పెట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్లింది. ఆ తర్వాత ఇంకో బస్తా మోసింది. హర్షద యాభై కిలోల బియ్యం బస్తా ఎత్తడం చూసి ఆమె తండ్రి ఆశ్చర్యపోయాడు. ఆమెకు ట్రైనింగ్ ఇస్తే బెస్ట్ వెయిట్​లిఫ్టర్ అవుతుందని ఆ రోజే అనుకున్నా డాయన. తండ్రి, మేనమామ దగ్గర మెలకువలు నేర్చుకుంది. బిహారీలాల్ దూబే దగ్గర కోచింగ్ తీసుకుని రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించింది. 2020 ఖేలో ఇండియా యూత్ గేమ్స్​లో అండర్–17 గర్ల్స్ టైటిల్ గెలిచి వార్తల్లో నిలిచింది హర్షద. ఈ ఏడాది గ్రీస్​లో జరుగుతున్న జూనియర్ వరల్డ్ ఛాంపియన్​షిప్​లో పతకం గెలవడమే లక్ష్యంగా పెట్టుకుంది. పంజాబ్​లోని పాటియాలలో ఉన్న నేతాజీ సుభాష్​ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్​ స్పోర్ట్స్​లో నెల రోజులు ట్రైనింగ్ తీసుకుంది.  

చదువులో ఫస్టే..
స్కూల్లో  ఫ్రెండ్స్​తో కలిసి బాగా అల్లరి చేసేది హర్షద.  క్లాస్​రూంలో ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేది. దాంతో, ఆమెను అందరూ ‘రేడియో’ అని పిలిచేవాళ్లు. హర్షద అల్లరి చేయడం చూసి, ఒక టీచర్ ‘నీకు కనీసం పాస్ మార్కులు (35) కూడా రావు’ అనేవాడు. టీచర్ మాటల్ని ఛాలెంజింగ్​గా తీసుకుని బాగా చదివి, ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంది. స్వీట్ బాక్స్ పట్టుకుని ఆ టీచర్ దగ్గరకెళ్లి,  ‘సార్... నేను ఫస్ట్ క్లాస్​లో పాసయ్యా. ఇకపై ఏ స్టూడెంట్​తో కూడా ‘నువ్వు పాస్ కావు అనకండి’ అని చెప్పింది. హర్షద ప్రస్తుతం సావిత్రిబాయి పూలే పుణే యూనివర్సిటీలో బి.ఎ. ఫస్ట్ ఇయర్ చదువుతోంది. 

నమ్మలేకపోతున్నా...
‘‘ఈ పోటీల్లో కచ్చితంగా పతకం సాధిస్తా అనుకున్నా. అయితే గోల్డ్ మెడల్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది.  మానాన్న, మేనమామ నన్ను చాలా ప్రోత్సహించారు. నాకు చికెన్​, పావుబాజీ చాలా ఇష్టం. పాటియాల ట్రైనింగ్ క్యాంప్​లో ఒలింపిక్స్​లో సిల్వర్ మెడల్​ గెలిచిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానుతో మాట్లాడా. ఆమె జర్నీ గొప్పగా అనిపించింది. 
నేను కూడా ఆమెలా ఒలింపిక్స్ పతకం సాధించాలి అనుకుంటున్నా. 2028 ఒలింపిక్స్​లో పతకం గెలవాలన్నది నా డ్రీమ్” అంటోంది హర్షద.