పోలవరం కెపాసిటీ పెంపుతో.. రాష్ట్రంలో 45 వేల ఎకరాలు మునుగుతయ్‌

పోలవరం కెపాసిటీ పెంపుతో.. రాష్ట్రంలో 45 వేల ఎకరాలు మునుగుతయ్‌

ప్రాజెక్టు నిర్మాణానికి మేం వ్యతిరేకం కాదు

కెపాసిటీ పెంపుపై సైంటిఫిక్‌ స్టడీ అవసరం

పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలంగాణ లెటర్‌

హైదరాబాద్‌, వెలుగు: పోలవరం ప్రాజెక్టు కెపాసిటీ పెంపుతో తెలంగాణలో 45 వేల ఎకరాల భూమి ముంపునకు గురవుతుందని, భద్రాచలం రామాలయం, మణుగూరు హెవీ వాటర్‌‌ ప్లాంట్‌, ఐటీసీకి కూడా ముంపు ప్రమాదం ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవోకు తెలంగాణ ఇరిగేషన్‌ ఈఎన్సీ ఆదివారం లెటర్‌‌ రాశారు. పీపీఏ, సీడబ్ల్యూసీ అధికారులు, ఎగువ రాష్ట్రాల ఆఫీసర్లతో అక్టోబర్‌‌ 14న నిర్వహించిన సమావేశంలో చర్చించిన అంశాలపై రాష్ట్ర అభిప్రాయాలు, అభ్యంతరాలను ఏడు పేజీల లెటర్‌లో పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ రాష్ట్రం వ్యతిరేకం కాదని, అయితే కెపాసిటీ పెంపుపై మాత్రం సైంటిఫిక్ట్‌ స్టడీ తప్పనిసరిగా జరగాలని సూచించారు.

బ్యాక్‌ వాటర్‌‌తో తెలంగాణకే ముప్పు

పోలవరం ప్రాజెక్టు ఆనకట్ట ఎత్తు పెంపు, డిశ్చార్జి కెపాసిటీ 36 లక్షల క్యూసెక్కుల నుంచి 50 లక్షల క్యూసెక్కులకు పెంచడంతో బ్యాక్‌ వాటర్‌లో తెలంగాణ భూభాగం ఎక్కువగా ముంపునకు గురవుతుందని తెలిపారు. ప్రాజెక్టు ఎత్తు పెంపుతో కేవలం 45.72 మీటర్ల మేర మాత్రమే నీరు నిలుస్తుందని, దీంతో బూర్గంపాడుకు ఎగువన 200 ఎకరాలు మాత్రమే మునుగుతుందని ఏపీ చెబుతోందన్నారు. ఐఐటీ హైదరాబాద్‌ స్టడీ ప్రకారం పోలవరం ఎత్తు పెంపుతో గోదావరిలో 60 మీటర్లకు ఎగువన నీళ్లు నిలిచి  45 వేల ఎకరాలకు పైగా భూమి ముంపునకు గురవుతుందని లెటర్‌‌లో పేర్కొన్నారు. దుమ్ముగూడెం వద్ద 65.31 మీటర్లు, భద్రాచలం పట్టణం వద్ద 62.17 మీటర్ల ఎత్తులో నీళ్లు నిలిచి ఉంటాయని తెలిపారు. కానీ భద్రాచలం వద్ద 55 మీటర్ల ఎత్తులోనే నీళ్లు నిలుస్తాయని ఏపీ తప్పుడు నివేదిక సమర్పించిందన్నారు. పోలవరం కెపాసిటీ పెంపుతో 72 గ్రామాలపైనే వరద ప్రభావం ఉంటుందని ఏపీ చెప్తోందని, కానీ 94 గ్రామాలు ముంపునకు గురవుతాయని ఐఐటీ హైదరాబాద్‌ అధ్యయనంలో తేలిందన్నారు. తెలంగాణ భూభాగాన్ని, చారిత్రక రామాలయాన్ని ముంపునకు గురి చేసేలా  ఏపీ, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని చెప్పారు.

అభ్యంతరాలు పరిశీలించకుండానే పనులు

పోలవరం ద్వారా తీసుకునే గోదావరి నీళ్లను ఏపీ ప్రభుత్వం కృష్ణా, పెన్నా బేసిన్‌కు తరలించేందుకు కొత్త ప్రాజెక్టులు చేపడుతోందని, 2018లోనే జీవో నం.51 జారీ చేసిందని తెలిపారు. ఇదే విషయాన్ని 2020 బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఆ రాష్ట్ర గవర్నర్‌తోనూ అసెంబ్లీలో చెప్పించారని లెటర్‌‌లో పేర్కొన్నారు. పోలవరం ముంపుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యావరణ ప్రభావంపై సైంటిఫిక్‌ స్టడీ చేయించాలన్నారు. ప్రజలతో సమావేశాలు నిర్వహించి, 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం, ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ చెల్లించాలని కోరారు. భద్రాచలం ఆలయానికి, హెవీ వాటర్‌ ప్లాంట్‌కు, ఐటీసీకి నష్టం వాటిల్లకుండా రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రాజెక్టులో నీటిని ఎన్ని రోజులు నిల్వ చేస్తుందనే విషయాన్ని ఏపీ ఎక్కడా వెల్లడించడం లేదన్నారు. తెలంగాణ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా ఏపీ, కేంద్ర ప్రభుత్వాలు ప్రాజెక్టు పనులను కొనసాగించడం సరికాదని ఈఎన్సీ లెటర్‌‌లో పేర్కొన్నారు.