
- భూముల విలువ, చార్జీల పెంపుతో మస్తు ఆమ్దానీ
- నెలరోజుల్లోనే సర్కారుకు రూ. 1,124 కోట్లు
- ఇందులో రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా 824 కోట్లు, రెవెన్యూ శాఖ ద్వారా 300 కోట్లు
- జోరుగా అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ భూముల రిజిస్ట్రేషన్లు
హైదరాబాద్, వెలుగు: భూముల విలువ, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుతో రాష్ట్ర సర్కారుకు ఆమ్దానీ మస్తుగా వస్తోంది. ఒక్క నెల రోజుల్లోనే రూ. 1,124 కోట్ల ఆదాయం సమకూరింది. రాష్ట్రంలో పెరిగిన రిజిస్ట్రేషన్ చార్జీలు జులై 22 నుంచి అమల్లోకి రాగా.. అప్పటి నుంచి ఈ నెల 22 వరకు నాన్ అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్లు సుమారు లక్ష వరకు జరగ్గా, అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్లు 84 వేల దాకా జరిగాయి. దీంతో నెల వ్యవధిలో రిజిస్ట్రేషన్ల శాఖకు రూ. 824 కోట్లు, రెవెన్యూ శాఖకు రూ. 300 కోట్ల ఆదాయం వచ్చింది. గతంతో పోలిస్తే రిజిస్ట్రేషన్ల సంఖ్య కొద్దిగా తగ్గినప్పటికీ, ఆ శాఖ ఆదాయం మాత్రం పెరిగింది.
రిజిస్ట్రేషన్ల శాఖకు జులైలోనే రూ. 991 కోట్లు
జులై 22 నుంచి ఈ నెల 22 వరకు రిజిస్ట్రేషన్ల శాఖకు రిజిస్ట్రేషన్లు, ఈ స్టాంప్స్, ఫ్రాంకింగ్ మిషన్, ఈసీలు, సర్టిఫైడ్ కాపీల జారీ ద్వారా రూ. 824 కోట్ల ఆదాయం వచ్చింది. జులై 22 నుంచి 31 వరకు రూ. 306 కోట్లు రాగా.. ఆగస్టు 1 నుంచి 22 వరకు రూ. 518 కోట్ల ఇన్ కమ్ సమకూరింది. అయితే చార్జీలు పెరగకముందు, పెరిగినంక.. ఒక్క జులై వరకే తీసుకుంటే, ఆ ఒక్క నెలలోనే 85 వేల రిజిస్ట్రేషన్లు కాగా, రికార్డు స్థాయిలో రూ. 991 కోట్ల ఆదాయం వచ్చింది. ఆగస్టులో ఇప్పటి వరకు దాదాపు 70 వేల రిజిస్ట్రేషన్లు కాగా, రూ. 518 కోట్ల ఇన్ కమ్ సమకూరింది. భూముల విలువ పెరగకముందు రిజిస్ట్రేషన్ల శాఖకు ప్రతి నెల యావరేజ్ గా రూ. 500 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. చార్జీల పెంపుతో జులైలో అదనంగా రూ. 491 కోట్ల ఇన్ కమ్ వచ్చింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో చూస్తే ఏప్రిల్ లో రూ. 582 కోట్లు, మేలో రూ. 138 కోట్లు, జూన్ లో రూ. 630 కోట్ల ఆమ్దానీ సమకూరింది. మేలో లాక్డౌన్ వల్ల ఆదాయం తగ్గింది. గతంలో రిజిస్ట్రేషన్ ఫీజు 6 శాతముండగా, ఇప్పుడు 7.5 శాతం వసూలు చేస్తున్నారు.
నెలలో ధరణి రిజిస్ట్రేషన్లు 84 వేలు
అగ్రికల్చర్ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. భూముల విలువ పెంచినప్పటి (జులై 22) నుంచి ఈ నెల 22 వరకు ధరణిలో సుమారు 84 వేల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు అయ్యాయి. వీటి ద్వారా రెవెన్యూ శాఖకు దాదాపు రూ. 300 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు చెప్తున్నారు. మరో 13 వేల మ్యుటేషన్లు పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం భూముల విలువను ఏరియాను బట్టి 30 శాతం నుంచి 50 శాతం వరకు పెంచింది.