రికాం లేని వానలు..జోరుగా ఎవుసం

రికాం లేని వానలు..జోరుగా ఎవుసం
  • ఇప్పటికే 24 లక్షల ఎకరాల్లో వరి
  • 47.59 లక్షల ఎకరాల్లో పత్తి సాగు 
  • రాష్ట్ర సర్కారుకు వ్యవసాయ శాఖ నివేదిక 

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:  రాష్ట్రంలో వానలు జోరుగా కురవడంతో ఈ యేడు వానాకాలం ఎవుసం కూడా జోరుగా సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పునాస పంటల సాగు ఇప్పటికే కోటి ఎకరాలకు చేరువైంది. పోయిన నెలలో రికాంలేని వానలతో సాగు సరిగ్గా కాలేదు. తాజాగా వానలు తెరిపినివ్వడంతో వరి, ఇతర పంటల సాగు ఊపందుకుంది. ఇప్పటివరకు 90 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. సుమారు 24 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. ఈ నెలాఖరు వరకు వరి సాగు ఇంతకు రెట్టింపు అయ్యే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అలాగే ఈ ఏడాది 75 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అయ్యేలా చూడాలని టార్గెట్ పెట్టుకోగా.. 47.59 లక్షల ఎకరాల్లో సాగు అయింది. ఈ మేరకు రాష్ట్రంలో పంటల సాగుకు సంబంధించిన వివరాలతో వ్యవసాయ శాఖ బుధవారం ప్రభుత్వానికి నివేదిక అందజేసింది.    

వరి టార్గెట్ 45 లక్షల ఎకరాలు  
వానాకాలంలో వరి సాధారణ సాగు 42 లక్షల ఎకరాలు కాగా, ఈ యేడు 45 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలని సర్కారు టార్గెట్‌‌‌‌ పెట్టింది. ఇప్పటికే వరి సాధారణ సాగులో 57 శాతం సాగు నమోదైంది. అధికంగా నిజామాబాద్‌‌‌‌ జిల్లాలో 3.38 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. ఆ తర్వాత మెదక్‌‌‌‌ లో 2 లక్షలు, కామారెడ్డిలో 1.85 లక్షలు, యాదాద్రిలో1.79 లక్షలు, కరీంనగర్‌‌‌‌లో 1.31 లక్షలు, నల్గొండలో 1.18 లక్షలు, ఖమ్మం, సిద్దిపేట జిల్లాల్లో 1.43 లక్షల ఎకరాల చొప్పున వరి సాగు చేశారు. మిగతా జిల్లాల్లో 50 వేల నుంచి లక్ష ఎకరాల్లో వరి నాట్లు వేశారు.  కొన్ని జిల్లాల్లో వరి సాగు ఇప్పుడిప్పుడే జోరందుకుంటోంది.  

మిగతా పంటలు ఇలా.. 
కంది 5.37 లక్షల ఎకరాల్లో వేయగా, మక్కలు 4.55 లక్షల ఎకరాల్లో, సోయా 3.77 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. జొన్న 26 వేలు, సజ్జ 687, పెసలు 60 వేలు, మినుములు 28 వేలు, వేరుశనగ 7 వేల ఎకరాల్లో సాగు కాగా, సన్‌‌‌‌ ఫ్లవర్‌‌‌‌ 70 ఎకరాల్లో సాగైంది.  

సాగులో నల్గొండ టాప్ 
పునాస పంటల సాగులో నల్గొండ జిల్లా 7.52 లక్షల ఎకరాలతో టాప్‌‌‌‌లో నిలిచింది. ఆ తర్వాత ఆదిలాబాద్‌‌‌‌ 5.47 లక్షల ఎకరాలతో రెండో స్థానంలో నిలిచింది. ఇక వికారాబాద్‌‌‌‌లో 4.94 లక్షలు, నిజామాబాద్‌‌‌‌ లో 4.31 లక్షలు, కామారెడ్డిలో 3.87 లక్షలు, నాగర్‌‌‌‌ కర్నూల్‌‌‌‌ లో 3.54 లక్షలు, ఖమ్మంలో 3.50 లక్షలు, నారాయణపేట్‌‌‌‌ లో 3.34 లక్షలు, మహబూబాబాద్, యాదాద్రి జిల్లాల్లో 3 లక్షల ఎకరాల్లో పంటల సాగు జరిగినట్లు వ్యవసాయశాఖ పేర్కొంది.