మరో రెండువారాల్లో గ్రూప్ – 3 నోటిఫికేషన్ .. గ్రూప్ – 4 కోసం ముమ్మర కసరత్తు

మరో రెండువారాల్లో గ్రూప్ – 3 నోటిఫికేషన్ .. గ్రూప్ –  4  కోసం ముమ్మర కసరత్తు

రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ  ప్రక్రియను వేగవంతం చేస్తామని టీఎస్పీఎస్సీ అధికారులు అంటున్నారు.  గ్రూప్ వన్ పరీక్ష నిర్వహణ తరువాత మరో వారం నుంచి పది రోజుల్లో గ్రూప్ 3 నోటిఫికేషన్ ను విడుదల చేసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే గ్రూప్ 3,  గ్రూప్ 2 నోటిఫికేషన్ల పై  టీఎస్పీఎస్సీ అధికారులు ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు . తాజాగా గిరిజన రిజర్వేషన్ల పెంపుతో పాటు రోస్టర్  పాయింట్ల ఖరారు వంటి చర్యలు పూర్తి చేయడంతో నియామకాల ప్రక్రియ శరవేగంగా పూర్తిచేస్తామని అధికారులు చెబుతున్నారు. 

మెయిన్స్ పరీక్షకు ఏర్పాట్లు..

గ్రూప్ -1 ఫైనల్ కీ విడుదల కావడంతో మెయిన్స్ పరీక్షకు టీఎస్ పీఎస్సీ  ఏర్పాట్లు చేస్తోంది. నోటిఫికేషన్లకు సంబంధించి ఓసీలకు 44 ఏళ్లు,  బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 49 ఏళ్లు, దివ్యాంగులకు 54 ఏళ్ల వరకు వయోపరిమితిని పెంచడంతో పరీక్షలకు పోటీ తీవ్రంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక పై అన్ని విభాగాలు,  ప్రభుత్వ శాఖలు ఏటా ఏర్పడే ఖాళీల వివరాలతో ఎప్పటికప్పుడు నివేదికలను సిద్ధం చేస్తున్నాయి.  తద్వారా నోటిఫికేషన్ల జారీకి ఆయా నియామక సంస్థలకు సమాచారం చేరవేయాలని  ఇప్పటికే ఆర్థికశాఖ నిర్ణయించింది. దీంతో ఉద్యోగాల భర్తీ పై టీఎస్పీఎస్సీ  ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తోంది. 

గిరిజన రిజర్వేషన్ల పెంపునకు అనుగుణంగా.. 

రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లు 6 నుంచి 10 శాతానికి పెరగడంతో అందుకు వీలుగా ప్రతిపాదనల్లో మార్పులు, చేర్పులు ప్రభుత్వం పూర్తి చేసింది.  రానున్న నోటిఫికేషన్లలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లకు వీలుగా టీఎస్పీఎస్సీ అధికారులు సవరణలు చేస్తున్నారు. 10 శాతం రిజర్వేషన్ల నేపథ్యంలో 100 రోస్టర్  పాయింట్లలో 10 రోస్టర్  పాయింట్లు గిరిజనులకు రిజర్వ్  చేసింది. ఇప్పటికే 52 వేల ఉద్యోగాలకు ప్రభుత్వం అనుమతులు జారీ చేయగా, 18 వేల పోలీస్  కానిస్టేబుల్ , ఎస్సై ఉద్యోగాలకు నియామక ప్రక్రియ పూర్తి అవుతుంది. 

గ్రూప్ 4  కోసం 33 జిల్లాల ప్రతిపాదనలు

గ్రూప్ -4 ఉద్యోగాలకు ఒక్కో జిల్లాలో 74 విభాగాల చొప్పున 33 జిల్లాల ప్రతిపాదనలు అందినట్టు ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్నాయి. కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల నేపథ్యంలో రోస్టర్  పాయింట్  1 నుంచి నియామకాలు అమలు చేయమని ప్రభుత్వం చెప్పిన దాని పక్రారమే నియామకాలు ఉంటాయని టీఎస్పీఎస్సీ అధికారులు చెబుతున్నారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ఇంకా ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాచారం రాలేదని టీఎస్పీఎస్సీ అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల లో గ్రూప్ 3 వచ్చే నెలలో గ్రూప్ 2 నోటిఫికేషన్లు ఇచ్చేలా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు సమావేశాలు నిర్వహిస్తున్నారు . ఎన్నికలకు మరో సంవత్సర టైం ఉండటంతో ఈ సంవత్సరం లోపల అన్ని ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిరుద్యోగులు కోరుకుంటున్నారు. గ్రూప్ 3, గ్రూప్ 2 కంటే ముందు టీఆర్టీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.