ఫైర్ సేఫ్టీ లేకుంటే.. కాలేజీలు మూయాల్సిందే

ఫైర్ సేఫ్టీ లేకుంటే.. కాలేజీలు మూయాల్సిందే
  • ప్రైవేట్ కాలేజీలకు తేల్చిచెప్పిన హైకోర్టు
  • ఫైర్ సేఫ్టీ సర్క్యులర్​పై 10 రిట్లు
  • తీర్పును వాయిదా వేసిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: ఫైర్ సేఫ్టీ రూల్స్ పాటించని కాలేజీలను మూసేయాల్సిందేనని, వేరే దారిలేదని హైకోర్టు తేల్చిచెప్పింది. ఫైర్ డిపార్ట్ మెంట్ ఇచ్చిన సర్క్యులర్ ను సవాల్ చేస్తూ శ్రీచైతన్య ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూషన్స్, శ్రీగాయత్రి ఎడ్యుకేషనల్‌ సొసైటీ, గౌతమి జూనియర్‌ కాలేజీ, ఇతర కాలేజీలు వేసిన10 రిట్లను చీఫ్‌ జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ గురువారం విచారణను ముగించింది. వీటిపై తీర్పును వాయిదా వేసింది. పాత బిల్డింగుల్లో ఫైర్ సేఫ్టీ రూల్స్ అమలు  సాధ్యం కాదని, ఆ బిల్డింగుల్లోని కాలేజీలను మూసేయాల్సిందేనని అభిప్రాయపడింది. చాలా కాలేజీలు విద్యా సంస్థలుగా కాకుండా  వాణిజ్య సంస్థలుగా ఎక్కువ గుర్తింపు పొందాయని, దోపిడీకి పాల్పడుతున్నాయని కామెంట్ చేసింది. ఢిల్లీలోనూ ఫైర్ సేఫ్టీ లేని బిల్డింగుల్లో కాలేజీలున్నాయని, రాష్ట్రంలోనూ అనుమతివ్వాలని పిటిషనర్ల తరఫు అడ్వకేట్ కోరడంపై డివిజన్ బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలో అక్రమంగా ఉన్నాయని, హైదరాబాద్​లోనూ ఉండాలంటారా? అని ప్రశ్నించింది. పిల్లల ఫ్యూచర్ కోసం అనుమతివ్వాలని కోరడంతో.. భవిష్యత్తు పేరుతో ప్రాణాలను పణంగా పెట్టలేమని స్పష్టం చేసింది.

40 కాలేజీలు మూత..

ప్రభుత్వం తరఫున సంజీవ్‌ కుమార్‌ వాదిస్తూ.. 68 కాలేజీలకు నోటీసులిస్తే 40 కాలేజీలు మూతపడ్డాయని, 28 కాలేజీలను తరలించారని తెలిపారు. నోటీసులు ఇచ్చిన కాలేజీల్లో 9 ఎన్‌వోసీలు పొందాయన్నారు. నారాయణ సంస్థకు 26 నోటీసులు ఇస్తే 3 కాలేజీలు ఎన్‌వోసీ పొందాయని, మరో మూడింటిని తరలించిందని, 20 కాలేజీలను మూసేసిందన్నారు. శ్రీచైతన్య సంస్థలో18 కాలేజీలకు నోటీసులిస్తే 4 ఎన్‌వోసీ పొందాయని, మరో 4 తరలించారని, పదింటిని మూసేశారని పేర్కొన్నారు. శ్రీగాయత్రికి 8 నోటీసులు ఇవ్వగా4 కాలేజీలను తరలించారని, మరో 4 మూసేశారన్నారు. ఇతర కాలేజీలకు 11 నోటీసులు ఇవ్వగా, 1 ఎన్ వోసీ, 7 తరలింపు, 3 మూసేశారని వివరించారు.