బలం లేకనే బీజేపీ, కాంగ్రెస్ పోటీ చేయలే

బలం లేకనే బీజేపీ, కాంగ్రెస్ పోటీ చేయలే
  • ఎంత మంది పార్టీ వీడినా అధైర్యపడొద్దు: ఎమ్మెల్సీ కవిత

మెట్​పల్లి, కొండగట్టు, వెలుగు: లోకల్​బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజీపీ బలం లేక పోటీ చేయలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాక శనివారం కొండగట్టు అంజన్నను దర్శించుకునేందుకు వెళ్తూ ఆమె మెట్​పల్లిలో ఆగారు. ఈ సందర్భంగా లోకల్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆమెను సన్మానించారు. తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రజల నాడి తెలిసిన ఉద్యమ నాయకుడని, ఎంత మంది పార్టీ వీడినా.. ఆలోచించవద్దని సూచించారు. పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో అందరికి పదవులు వస్తాయని తెలిపారు. ఏ ఎలక్షన్లు వచ్చినా టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధిస్తారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ అభ్యర్థులే గెలుస్తారన్నారు.

కొండగట్టు అభివృద్ధికి నిధులు
కొండగట్టు క్షేత్రం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నిధులు మంజూరు చేస్తుందని కవిత చెప్పారు. కొండగట్టు అంజన్నను దర్శించుకొని, భేతాళ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం వద్ద నిర్మిస్తున్న రామనామ స్థూపాన్ని సందర్శించి పనుల వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ గా అభివృద్ధి చెందడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నాడని తెలిపారు. ఆమె వెంట చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్, దావ వసంత, బోగ శ్రావణి తదితరులు ఉన్నారు.