ఐఐఎం కలకత్తాలో యువతిపై అత్యాచారం.!

ఐఐఎం కలకత్తాలో యువతిపై అత్యాచారం.!

 

  • కౌన్సెలింగ్ కోసమని హాస్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పిలిచి తోటి విద్యార్థి అఘాయిత్యం 
  • నిందితుడి అరెస్టు.. వారం పాటు పోలీస్ కస్టడీ 

కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా: బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మరో దారుణం జరిగింది. ఐఐఎం కలకత్తాలో యువతిపై అత్యాచారం జరిగింది. తన తోటి విద్యార్థి క్యాంపస్ హాస్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పిలిచి తనపై అత్యాచారానికి పాల్పడినట్టు బాధిత యువతి ఆరోపించింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరగ్గా, కేసు వివరాలను పోలీసులు శనివారం వెల్లడించారు. ‘‘నా తోటి విద్యార్థి కౌన్సెలింగ్ సెషన్ కోసం నన్ను క్యాంపస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని బాయ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాస్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పిలిచాడు. అక్కడికి వెళ్లాక మత్తు మందు కలిపిన డ్రింక్ ఇచ్చాడు. అది తాగిన తర్వాత నేను స్పృహ కోల్పోయాను. నాకు స్పృహ వచ్చి లేచేసరికి, నాపై అత్యాచారం జరిగిందని అర్థమైంది. దీని గురించి ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని అతడు నన్ను హెచ్చరించాడు” అని బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతణ్ని శనివారం కోర్టులో హాజరుపరిచారు. నిందితుడిని విచారించేందుకు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరగా, ఈ నెల 19 వరకు అనుమతిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. 

నా బిడ్డపై రేప్ జరగలేదు: బాధితురాలి తండ్రి 

తన బిడ్డపై రేప్ జరగలేదని బాధితురాలి తండ్రి తెలిపాడు. పోలీసులే బలవంతంగా తన బిడ్డతో తప్పుడు కేసు పెట్టించారని ఆరోపించాడు. ‘‘నాకు శుక్రవారం రాత్రి 9:34 గంటలకు ఫోన్ వచ్చింది. నా బిడ్డ ఆటోలో నుంచి పడిపోయిందని, స్పృహ కోల్పోయిందని, ఆస్పత్రిలో చేర్పించామని పోలీసులు చెప్పారు. నేను నా బిడ్డతో మాట్లాడాను. తనపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని ఆమె చెప్పింది. అత్యాచార ఆరోపణలు చేయాలని పోలీసులే బలవంతం చేసినట్టు తెలిపింది” అని మీడియాకు వెల్లడించాడు. పోలీసులు అరెస్టు చేసిన వ్యక్తితో తన బిడ్డకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నాడు. తన కూతురు ఇప్పుడు బాగానే ఉందని చెప్పాడు.