మహిళపై దాడికి పాల్పడ్డ షాపింగ్ మాల్ సిబ్బందిపై చర్యలు తీస్కోవాలె: దాసు సురేశ్

మహిళపై దాడికి పాల్పడ్డ షాపింగ్ మాల్  సిబ్బందిపై చర్యలు తీస్కోవాలె: దాసు సురేశ్
  • మహిళపై దాడికి పాల్పడ్డ షాపింగ్ మాల్  సిబ్బందిపై చర్యలు తీస్కోవాలె
  • బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్​ డిమాండ్      
  • హనుమకొండకు చెందిన బాధిత మహిళతో కలిసి ప్రెస్ మీట్ 

బషీర్ బాగ్, వెలుగు: దొంగతనం నెపంతో ఓ మహిళను, ఆమె పదేండ్ల కూతురిని వివస్త్రను చేసి విచక్షణారహితంగా దాడి చేసిన షాపింగ్ మాల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధిత మహిళతో కలిసి ఆయన మాట్లాడారు.

తన వద్ద ఉన్న చీరకు మ్యాచింగ్ బ్లౌస్ కొనేందుకు హనుమకొండలోని ఓ షాపింగ్ మాల్ కు బాధిత మహిళ వెళ్లిందని.. అయితే, తాను తీసుకెళ్లిన చీరను షాప్ లో దొంగిలించిందంటూ సిబ్బంది నిర్బంధించారని తెలిపారు. బాధితురాలిని, ఆమె బిడ్డను చెయ్యని నేరాన్ని ఒప్పుకోవాలంటూ చిత్రహింసలకు గురి చేశారని, అసభ్య పదజాలంతో దూషించారన్నారు. చెకింగ్ పేరుతో వారిని వివస్త్రలను చేసి, మానసిక క్షోభకు గురి చేశారన్నారు.

ఈ అంశంపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తే పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కు సంబంధించిన షాపింగ్ మాల్ కావడం వల్లే బాధితులకు న్యాయం జరగలేదన్నారు. సీఎం కేసీఆర్ ఈ అంశంపై జోక్యం చేసుకొని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని.. షాపింగ్ మాల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని దాసు సురేశ్​ డిమాండ్ చేశారు. సినీ తారలు కూడా ఇలాంటి షాపింగ్ మాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. బ్రాండ్ అంబాసిడర్స్ ప్రచారాన్ని అడ్డుపెట్టుకొని షాపింగ్ మాల్స్ ఓనర్లు నకిలీ చేనేత వస్త్రాలను విక్రయిస్తున్నారన్నారు.