
హైదరాబాద్: పురిటి నొప్పులతో హాస్పిటల్ కు వెళుతున్న ఓ నిండుగర్భిణీ ట్రాఫిక్ జామ్ కారణంగా మార్గమధ్యంలోనే ప్రసవించింది. ఈ సంఘటన చాదర్ ఘాట్ పరిధిలోని మలక్ పేట నల్గొండ × రోడ్ చౌరస్తా వద్ద జరిగింది.
అంబులెన్స్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం….మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రవి, గౌరీ(22) నగరంలోని బడంగ్ పేటలో నివాసముంటున్నారు. నిండు గర్భిణీ అయిన గౌరీకి పురిటి నొప్పులు రావటంతో ఓలా క్యాబ్ లో హాస్పిటల్ కు బయలుదేరారు. అయితే మార్గం మధ్యలో నొప్పులు ఎక్కువవుడంతో 108 కి కాల్ చేయగా సంతోష్ నగర్ చౌరస్తాలో 108 సిబ్బంది ఆమెను అంబులెన్స్ లోకి ఎక్కించారు.
పేట్ల బురుజు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా నల్గొండ చౌరస్తా వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో తప్పని పరిస్థితుల్లో అంబులెన్స్ ను రోడ్ పక్కనే నిలిపి గౌరీకి డెలివరీ చేశారు 108 సిబ్బంది. గౌరి మగ బిడ్డను ప్రసవించడంతో తల్లీ,బిడ్డను కోఠిలోని ప్రసూతి ఆసుపత్రిలో చేర్పించారు. తల్లీ,బిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నట్లు అంబులెన్స్ సిబ్బంది ఈఎంటీ శ్రీశైలం,పైలెట్ సాగర్ లు తెలిపారు.