
మల్యాల, వెలుగు : బట్టలు ఆరవేస్తుండగా కరెంట్ షాక్ కొట్టి మహిళ మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మల్యాల మండలం రాజారం గ్రామానికి చెందిన శీలం మానస(30) బుధవారం బట్టలు ఉతికి ఇంటి బయట తీగపై ఆరవేస్తుంది. తీగకు అనుకొని ఉన్న డిష్ వైర్ ద్వారా కరెంట్ షాక్ కొట్టడంతో ఆమె కుప్ప కూలిపడిపోయింది.
వైర్ కూడా తెగి ఆమె మెడకు చుట్టుకోవడంతో స్పాట్ లో మృతి చెందింది. వెంటనే స్థానికులు వెళ్లి పోలీసులు, ట్రాన్స్ కో అధికారులకు సమాచారం అందించగా వచ్చారు. మృతురాలి భర్త సంతోష్ మంగళవారం దుబాయ్ వెళ్లాడు. దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు. డిష్ కేబుల్ ఓనర్ అనిల్ కేబుల్ బాక్స్ ఇంట్లో ఏర్పాటు చేసి విద్యుత్ కనెక్షన్ ఇచ్చినట్లు, దీంతో అతని నిర్లక్ష్యం కారణంగానే తమ కూతురు చనిపోయిందని మృతురాలి తల్లి మల్లీశ్వరి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం నష్టపరిహారం చెల్లించాలని డెడ్ బాడీతో కుటుంబ సభ్యులు జగిత్యాలలోని డిష్ ఓనర్ ఇంటి ముందు ధర్నా చేశారు.