
ఇబ్రహీంపట్నం, వెలుగు: కోతుల దాడి నుంచి తప్పించుకోబోయిన ఓ మహిళ ప్రమాదవశాత్తు కిందపడింది. తీవ్రంగా గాయపడ్డ ఆమె హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ చనిపోయింది. వివరాల్లోకి వెళ్తే... రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పొల్కంపల్లి గ్రామానికి చెందిన బొడ్డు సుశీలమ్మ (65) 15 రోజుల కింద ఇంటి వద్ద ఉండగా.. ఒక్కసారిగా కోతుల గుంపు వచ్చింది.
వాటి దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు కిందపడడంతో తలకు తీవ్ర గాయమైంది. గమనించిన కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తరలించగా ట్రీట్‌మెంట్ తీసుకుంటూ బుధవారం చనిపోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామాల్లో కోతుల బెడదను నివారించాలని ప్రజలు కోరుతున్నారు.