మీరు దేవుళ్లు..! సైన్యం కాళ్లు మొక్కిన వరద బాధితురాలు

మీరు దేవుళ్లు..! సైన్యం కాళ్లు మొక్కిన వరద బాధితురాలు

మహారాష్ట్రను వానలు, వరద ముంచుతున్నాయి. వారాలు గడుస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. ఊళ్లు చెరువులవుతున్నారు. రోడ్లు నదులవుతున్నాయి. నేషనల్ హైవేలు, రైల్వే ట్రాక్ లు కనిపించకుండా మునిగిపోయాయి. కొల్హాపూర్, సాంగ్రి జిల్లాల్లో ఊళ్లు మునిగిపోవడంతో… లక్షలాది మందికి వరదలో బిక్కుబిక్కుమంటూ క్షణాలు యుగాల్లా గడుపుతున్నారు. సామాన్లు సర్దుకుని… సురక్షిత ప్రాంతాలకు తీసుకుపోయి కాపాడే దేవుడి కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి.

సైన్యం, NDRF బలగాలు, నేవీ బృందాలు రాత్రి పగలు రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నాాయి. తమను కాపాడిన జవాన్లకు ఓ మహిళ దండాలు పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నీళ్లలో ఉన్న తనను బోటు ఎక్కించిన సైనికుల కాళ్లు మొక్కింది. తనకు పునర్జన్మ ఇచ్చిన దేవుళ్లు అంటూ.. చుట్టూ ఉన్న సైనికులకు దండాలు పెట్టింది. ఈ వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ సామాన్యుడు పోస్ట్ చేసిన ఈ వీడియోను CRPF రీట్వీట్ చేసింది.

సైన్యం చేస్తున్న సాహసానికి… వరదల్లాంటి ప్రతికూల వాతావరణంలో నేవీ, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ చేస్తున్న రెస్క్యూ ఆపరేషన్ కు జనం జేజేలు పలుకుతున్నారు. బృందాలుగా ఊరూరు తిరుగుతూ ఆహార పొట్లాలు పంచుతున్నారు జవాన్లు.