మల్టీ నేషనల్​ కంపెనీ పేరుతో మోసం

మల్టీ నేషనల్​ కంపెనీ పేరుతో మోసం

మల్టీ నేషనల్ కంపెనీ పేరుతో సోయా డీ ఆయిల్డ్ మెటీరీయల్ ను సప్లై చేయించుకొని తిరిగి డబ్బులు చెల్లించకుండా మోసాలకు పాల్పడుతున్న మహిళను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కోదనుకుదురుకు చెందిన కోడూరు నీరజ(36) ఆమె బంధువైన కోడూరు రామతో కలిసి సోనక్ మల్టీ నేషనల్ కంపెనీ పేరుతో సోషల్ మీడియాతో పాటు గూగుల్ లో ప్రకటనలు ఇస్తున్నారు. నెదర్లాండ్ లోని కంపెనీతో అనుబంధంగా ఉన్నామని నమ్మిస్తూ మోసాలకు తెరలేపారు. ప్రకటనలు చూసి నమ్మిన నాగోలుకు చెందిన వీఎస్ ఎంటర్ ప్రైజెస్ కంపెనీ మేనేజింగ్ పార్ట్నర్ కవితచిన్నస్వామి వారితో ఆన్​లైన్​లోనే ఒప్పందం కుదుర్చుకుంది. తన వద్ద ఉన్న మెటీరియల్ సప్లై చేసేందుకు అంగీకరించింది. ముందుగా మెటీరీయల్ సప్లై చేస్తే అగ్రిమెంట్ ప్రకారం 60 రోజుల్లో డబ్బులు చెల్లించేట్లు మాట్లాడుకున్నారు. ఇలా సుమారు 90 లక్షల విలువైన మెటీరియల్ ను నీరజ, రామకు సప్లయ్ చేసింది. అగ్రిమెంట్ ప్రకారం గడువు ముగియడంతో బాధితులు నీరజను కాంటాక్ట్ చేశారు. నీరజ కానీ కంపెనీలో పనిచేసే ఇతరులు ఎవరూ రెస్పాండ్ కాకపోవడంతో అనుమానం వచ్చి కవితచిన్నస్వామి రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి నీరజను అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా సైబర్ క్రైమ్ సీఐ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఇలాంటి ఆన్​లైన్​అమ్మకాలను గుడ్డిగా నమ్మి మోసపోవద్దని సూచించారు.