సహజీవనం చేస్తున్న మహిళ హత్య?..ప్రమాదంగా చిత్రీకరించే యత్నం

సహజీవనం చేస్తున్న మహిళ హత్య?..ప్రమాదంగా చిత్రీకరించే యత్నం

బెల్లంపల్లి రూరల్, వెలుగు: అనుమానంతో తనతో సహజీవనం చేస్తున్న మహిళను ఓ వ్యక్తి హత్య చేశాడు. ఈ ఘటనతో మృతురాలి ఐదుగురు పిల్లలు అనాథలుగా మిగిలారు. పోలీసులు, మృతురాలి కొడుకు రాజబాను తెలిపిన వివరాల ప్రకారం.. మందమర్రి మండలం బుర్రగూడంకు చెందిన దుర్గం లక్ష్మి(40) భర్త రెండేళ్ల క్రితం విడిచిపెట్టడంతో ఐదుగురు పిల్లలను పోషిస్తూ కూలీ పనులు చేసేది. 

ఈ క్రమంలో కాసిపేట మండలానికి చెందిన పడిగల సంతోష్‌‌‌‌‌‌‌‌తో పరిచయం ఏర్పడి, ఆరు నెలలుగా మల్కెపల్లిలో సహజీవనం చేస్తోంది. అయితే లక్ష్మి ఇతరులతో మాట్లాడుతుందనే అనుమానంతో సంతోష్‌‌‌‌‌‌‌‌ తరచూ గొడవపడేవాడని తెలుస్తోంది. 

శుక్రవారం రాత్రి ఇద్దరి మధ్య మరోసారి వాగ్వాదం జరగగా, ఆగ్రహానికి గురైన సంతోష్‌‌‌‌‌‌‌‌ కర్రతో దాడి చేసి, పదునైన ఇనుప వస్తువుతో పొడిచి హత్య చేశాడు. ఘటనను ప్రమాదంగా చిత్రీకరించేందుకు శనివారం ఉదయం లక్ష్మిని కాసిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రమాదవశాత్తు మృతిచెందినట్లు సంతోష్‌‌‌‌‌‌‌‌ చెప్పాడు. అయితే మృతదేహంపై గాయాలను గమనించిన డాక్టర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు దేవాపూర్ ఎస్సై గంగారాం తెలిపారు. మృతురాలికి ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

మహాముత్తారంలో మరో ఘటన..

మహాముత్తారం, వెలుగు: తనతో కాకుండా మరొకరితో సహజీవనం చేస్తుందన్న కోపంతో మహిళను ఓ వ్యక్తి హత్య చేశాడు. స్థానికులు తెలిపిన ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం స్తంభంపల్లి(పీపీ) గ్రామానికి చెందిన కుమ్మరి భాగ్య(38) అదే గ్రామానికి  చెందిన కుమ్మరి శేఖర్ తో 20 ఏండ్లుగా గ్రామంలోనే సహజీవనం చేసింది. 6 నెలల క్రితం ఇద్దరి మనస్పర్ధలు రావడంతో ఇదే గ్రామానికి చెందిన జంగటి రాజేందర్ తో సహజీవనం చేస్తోంది. ఈ విషయాన్ని జీర్ణించుకొలేని శేఖర్ శనివారం తెల్లవారు జామున ఇంటి ముందు నిద్రిస్తున్న భాగ్యను ఇనుప రాడ్డుతో కొట్టాడు. ఆమెను హాస్పిటల్​కు తరలిండగా మృతిచెందింది. నిందితుడు పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం.