ధర్నాకొస్తే ఒక్కరికి రూ. 200 : డబ్బులివ్వకపోవడంతో మహిళల ఆగ్రహం

ధర్నాకొస్తే ఒక్కరికి రూ. 200 : డబ్బులివ్వకపోవడంతో మహిళల ఆగ్రహం

తూప్రాన్, వెలుగు: ధర్నాకొస్తే డబ్బులిస్తామని చెప్పి ఇవ్వకపోవడంతో టీఆర్ఎస్​లీడర్లపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా మెదక్​జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధి కరీంగూడలో 44వ జాతీయ రహదారిని దిగ్బంధించాలని టీఆర్ఎస్​లీడర్లు నిర్ణయించారు. కార్యక్రమానికి రైతు సంఘం నాయకులు, రైతులు పెద్దసంఖ్యలో రాలేదు. అయితే మంత్రి హరీశ్​రావుకు ఎక్కువమంది కనిపించాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ నాయకులు స్థానికంగా ఉండే వడ్డెర మహిళలు(రౌతు కొట్టుకునేవారు) 20 మందిని ఒక్కొక్కరికి రూ. 200 ఇస్తామని చెప్పి ధర్నాకు పిలిపించారు. ధర్నాకు వెళితే డబ్బులిస్తున్నారని తెలియడంతో మరో 30 మంది వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్​లీడర్లు ముందుగా పిలిపించిన వారికే డబ్బులు ఇవ్వడంతో మిగిలినవారంతా ఆందోళనకు దిగారు. టీఆర్ఎస్​లీడర్లు వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వినిపించుకోలేదు. చివరకు మహిళలకు డబ్బులివ్వకుండానే వెళ్లిపోయారు.