మహిళలు 10% కూడా లేరు : ఏడీఆర్​

మహిళలు 10%  కూడా లేరు  : ఏడీఆర్​
  •  లోక్ సభ ఎన్నికల్లో మొత్తం క్యాండిడేట్లు 8,337.. వారిలో మహిళలు 797 మాత్రమే 

న్యూఢిల్లీ:ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో మహిళా అభ్యర్థులు 10 శాతం కన్నా తక్కువగా ఉన్నారని అసోసియేషన్  ఫర్  డెమోక్రటిక్  రిఫార్మ్స్ (ఏడీఆర్) తెలిపింది. అభ్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్లను విశ్లేషించి ఏడీఆర్  ఈ వివరాలు వెల్లడించింది. ఈ ఎన్నికల్లో మొత్తం 8,337 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారని, వారిలో మహిళా అభ్యర్థుల సంఖ్య 797 (9.5 శాతం)  మాత్రమే అని ఏడీఆర్  తెలిపింది. 

ఏడీఆర్  డేటా ప్రకారం.. మొదటి దశలో 1,618 మంది అభ్యర్థుల్లో 135 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. అలాగే రెండో విడతలో మొత్తం 1,192 క్యాండిడేట్లు బరిలో నిలవగా.. వారిలో మహిళా అభ్యర్థులు 100 మందే ఉన్నారు. మూడో దశలో 1,352 మంది పోటీచేయగా వారిలో మహిళా క్యాండిడేట్ల సంఖ్య 123. నాలుగో ఫేజ్ లో 1,717 మంది అభ్యర్థుల్లో మహిళలు 170 మంది ఉన్నారు. 

ఇక ఐదో విడతలో అతి తక్కువగా 695 మంది క్యాండిడేట్లు ఉన్నారు. వారిలో మహిళా అభ్యర్థులు 82 మంది ఉన్నారు. ఆరో దశలో 869 మంది అభ్యర్థుల్లో మహిళలు 92 మంది ఉన్నారు. చివరిదైన ఏడో విడతలో 904 మంది క్యాండిడేట్లు ఉండగా.. వారిలో మహిళలు 95 మంది మాత్రమే ఉన్నారు.

మహిళలను ప్రోత్సహించాలి: మేధావులు

లోక్ సభ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల్లో మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉండడంపై మేధావులు, ప్రొఫెసర్లు, రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్  బిల్లును పాస్  చేసినా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో మహిళలకు మరిన్ని టికెట్లు ఇచ్చి ఉండాల్సిందన్నారు. మహిళలు ఎన్నికల్లో పోటీచేసేలా రాజకీయ పార్టీలు మరిన్ని చర్యలు తీసుకోవాలని ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్  డాక్టర్  సుశీల రామస్వామి కోరారు. రాజకీయ పార్టీలు మరింత మంది మహిళలను దింపి ఉండాల్సిందని ఆమె అభిప్రాయపడ్డారు. 

దేశంలోని మొత్తం ఓటర్లలో మహిళా ఓటర్లు సగం మంది ఉన్నా.. ఎన్నికల్లో వారు పోటీచేయడానికి సరైన వాతావరణం ఉండడం లేదని అలీగఢ్  ముస్లిం వర్సిటీలో అసొసియేట్  ప్రొఫెసర్  డాక్టర్  ఇఫ్తెకార్  అన్నారు. రాజకీయ పార్టీలు మహిళలను ప్రోత్సహించడం లేదని, ఈ వైఖరి మారాలని ఆయన సూచించారు. రాజకీయాల్లో మహిళలకు సమాన అవకాశాలు దక్కేలా సంస్థాగతంగా సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

లింగ వైవిధ్యతను ప్రోత్సహించడంలో రాజకీయ పార్టీలు కీలక పాత్ర పోషించాలని, మహిళా ఆశావహులకు సమాన అవకాశాలు కల్పించాలని ఆయన సూచించారు. కాగా.. లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు మూడింట ఒక వంతు సీట్లను రిజర్వు చేస్తూ ఇటీవలే బిల్లు పాస్  చేసిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవి. ఈ బిల్లు ఇంకా అమల్లోకి రావాల్సి ఉంది.