లాక్‌డౌన్‌ బ్రేక్‌ చేయకుండా.. గస్తీకాస్తున్న మహిళలు

లాక్‌డౌన్‌ బ్రేక్‌ చేయకుండా.. గస్తీకాస్తున్న మహిళలు
  • యూపీలోని బహరైచీ తాలూకు అక్బర్‌‌ పురాలో

బహరైచీ: ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని బహరైచీ తాలూకు అక్‌బర్‌‌పురాలో స్థానికులెవ్వరూ లాక్‌డౌన్‌ బ్రేక్‌ చేయకుండా మహిళలే గస్తీ కాస్తున్నారు. ఒక్కొక్కరు రెండు గంటల చొప్పున షిఫ్టులు వేసుకుని డ్యూటీ చేస్తున్నారు. గ్రామానికి ఉన్న నాలుగు పొలిమేరల్లో మూడింటిని మూసేసి, నాలుగో పొలిమేర నుంచి మాత్రం కూరగాయాలు, పండ్లు అమ్మే వాళ్లను లోపలికి రానిస్తున్నారు. గ్రామంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ అవగాహన కల్పిస్తున్నారు. “ గ్రామంలో లాక్‌డౌన్‌ను పటిష్ఠంగా అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకున్నాం. గుళ్లు, మసీదులు, చర్చీలు మూసేసి అందరూ ఇళ్లలో ప్రార్థనలు చేసుకుంటున్నారు. నిత్యావసరాలకు బయటకు వచ్చినా సోషల్‌ డిస్టెంసింగ్‌ పాటించేలా చర్యలు తీసుకుంటున్నాం” అని మాజీ కార్పొరేటర్‌‌ ఫైబినా అఫ్సర్‌‌ అన్నారు. మహిళలు ఉదయం పూట ఒక్కోరు రెండు గంటల పాటు డ్యూటీ చేస్తున్నారని, రాత్రిపూట మగవాళ్లు గస్తీ కాస్తున్నారని కార్పొరేటర్‌‌ అఫ్సర్‌‌ అలీ అన్నారు. పొద్దున సమయంలో కూరగాయాలు, పండ్లు, నిత్యావసరాలు అమ్మేందుకు వచ్చే వారిని మాత్రమే అనుమతిస్తున్నామని, గ్రామంలోని ప్రతి ఒక్కరు సోషల్‌ డిస్టెంసింగ్ పాటిస్తున్నారని అన్నారు. లాక్‌డౌన్‌ వేళ చాలా చోట్ల మహిళలు ముందుకు వచ్చి తమ వంతు బాధ్యతగా అవగాహన కల్పిస్తున్నారు. జమ్మూకాశ్మీర్‌‌, యూపీ, ఛత్తీస్‌గడ్‌లో మహిళలే సెక్యూరిటీగా ఉండి తమ ఊరిని కాపాడుకుంటున్నారు.