ఐపీఎల్ బెట్టింగ్​తో కోటిన్నర అప్పు.. భార్య సూసైడ్

ఐపీఎల్ బెట్టింగ్​తో కోటిన్నర అప్పు.. భార్య సూసైడ్
  • కర్నాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఘటన

బెంగళూరు: 
బెట్టింగ్​ వ్యసనంతో అప్పులపాలైన భర్త, మరోవైపు ఆ అప్పులిచ్చినోళ్ల వేధింపులకు 23 ఏండ్ల మహిళ బలైంది. తీవ్ర మనస్థాపంతో ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కర్నాటకలోని చిత్రదుర్గ జిల్లా హోసదుర్గలో మార్చి18 న ఈ ఘటన జరిగింది. ఇరిగేషన్ డిపార్ట్​మెంట్​లో అసిస్టెంట్ ఇంజినీర్​గా పనిచేస్తున్న దర్శన్ బాబుకు  రంజితతో 2020లో పెండ్లయింది. దర్శన్ బెట్టింగ్​ పెడుతున్నాడని ఏడాది తర్వాత గుర్తించిన భార్య రంజిత.. వద్దని వారించినా అతడు వినిపించుకోలేదు. అలా 2021 నుంచి 2023 మధ్య ఐపీఎల్ మ్యాచ్​లలో బెట్టింగ్​ పెడుతూ రూ.1.50 కోట్లకు పైగా దర్శన్ అప్పులు చేశాడు. ఉన్న ఆస్తులన్నీ అమ్ముకుని రూ. కోటిదాకా అప్పులు తీర్చాడు. అయినా రూ.84 లక్షల అప్పు మిగిలిపోయింది. ఆ డబ్బు ఇచ్చినవాళ్లంతా.. తిరిగి చెల్లించాలని అడుగుతుండటంతో దర్శన్ ఇంట్లో ఉండకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ క్రమంలో అప్పులవాళ్ల వేధింపులతో రంజిత తీవ్ర మనస్థాపానికి గురై ఈ నెల 18న ఇంట్లోనే ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. తన భర్తకు డబ్బులిచ్చినవాళ్లు వేధిస్తున్నారని సూసైడ్ నోట్​లో పేర్కొంది. ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు 13 మందిని అరెస్ట్ చేశారు. వాళ్లే అప్పులు ఇప్పిస్తూ తన అల్లుడిని బెట్టింగ్​కు బానిసను చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.