రగిలిపోతున్న కేరళ యువత : దీపక్ ఆత్మహత్య కేసులో రీల్స్ యువతి పరారీ.. అరెస్ట్ చేయాలంటూ డిమాండ్లు

రగిలిపోతున్న కేరళ యువత : దీపక్ ఆత్మహత్య కేసులో రీల్స్  యువతి పరారీ.. అరెస్ట్ చేయాలంటూ డిమాండ్లు

కేరళ రాష్ట్రంలో యువత రగిలిపోతుంది. సోషల్ మీడియా వేదికగా జస్టిస్ ఫర్ దీపక్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కేరళ బస్సులో షింజిత అనే యువతి చేసిన వీడియోలో.. దీపక్ అనే 42 ఏళ్ల వ్యక్తి.. బస్సులో అమ్మాయిలను ఎలా తాకుతున్నాడో చూడండీ అంటూ ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇది వైరల్ అయ్యింది. ఆ తర్వాత దీపక్ ఆత్మహత్య చేసుకున్నాడు.

 ఈ క్రమంలోనే.. వీడియో మొత్తాన్ని మళ్లీ మళ్లీ చూసిన కేరళ యువత.. అసలు ఆ వీడియోలో దీపక్ తప్పు ఎక్కడ ఉంది.. కనీసం షింజిత ముఖం కూడా దీపక్ చూడలేదు కదా అంటూ పెద్ద ఎత్తున రీల్స్ యువతిపై విరుచుకుపడుతున్నారు. రీల్స్ చేసిన షింజిత యువతిపై ఆత్మహత్య ప్రేరేపిత కేసు పెట్టిన పోలీసులు.. ఆమె కోసం వెతుకుతున్నారు. కేసు విషయం తెలిసిన తర్వాత షింజిత కేరళ నుంచి పారిపోయినట్లు చెబుతున్నారు పోలీసులు. దీనిపై కేరళ యువత భగ్గుమంటున్నారు. ఎక్కడున్నా అరెస్ట్ చేయాల్సిందే అంటూ డిమాండ్లు చేస్తున్నారు.

షింజిత  ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తుందని..ఆమె  విదేశాలకు వెళ్లే అవకాశం లేదని పోలీసులు చెబుతున్నారు. అయితే, ఆమె రాష్ట్రం విడిచి మంగళూరు చేరుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. షింజిత  కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. దీపక్ ఫుటేజ్ చిత్రీకరించిన మొబైల్ ఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాడికి గురైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బస్సు సిబ్బంది వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేశారు. బస్సులోని సీసీటీవీ ఫుటేజ్‌లను కూడా పోలీసులు పరిశీలించారు. సంఘటన జరిగిన రోజు ఎవరూ ఫిర్యాదు చేయలేదని బస్సు సిబ్బంది  తెలిపారు. ఫిర్యాదు చేసి ఉంటే పోలీసులకు సమాచారం ఇచ్చి ఉండేవారని బస్సు సిబ్బంది తెలిపారు.

ఐదు రోజుల క్రితం కోజికోడ్‌లోని గోవిందపురానికి చెందిన దీపక్ కన్నూర్‌కు బస్సులో వెళ్తుండగా అసభ్యకరంగా ప్రవర్తించాడని కేరళలోని వడకరకు చెందిని షింజిత అనే మహిళ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది కాస్త వైరల్ కావడంతో మనస్తాపానికి గురైన దీపక్ ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

 ఈ ఘటనపై కేరళ మానవ హక్కుల కమిషన్ కూడా స్పందించింది. సమగ్ర దర్యాప్తు చేసి వారంలోపు రిపోర్టు ఇవ్వాలని డీఐజీని ఆదేశించింది. ఫిబ్రవరి 19న ఈ కేసును కమిషన్ పరిశీలించనుంది. సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఆర్థిక లాభం కోసం ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి పెరుగుతున్నాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 

ఈ ఘటనపై కొందరు యువతి చేసిన దాంట్లో తప్పేం లేదంటుండగా.. అసభ్యంగా ప్రవర్తించి ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందని ఇంకొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.