వరంగల్ వరదల పరిష్కారంపై.. వనిత ఫోకస్.. శాశ్వత చర్యల్లో మహిళా నేతలు, ఆఫీసర్లదే మెయిన్‍ రోల్‍

వరంగల్ వరదల పరిష్కారంపై.. వనిత ఫోకస్.. శాశ్వత చర్యల్లో మహిళా నేతలు, ఆఫీసర్లదే మెయిన్‍ రోల్‍
  • ఫండ్స్​ కోసం సిటీ మంత్రిగా కొండా సురేఖ, ఎంపీగా కడియం కావ్య ప్రత్యేక దృష్టి
  • గ్రేటర్ వరంగల్‍ మేయర్‍గా గుండు సుధారాణి పర్యవేక్షణ
  • కలెక్టర్లుగా సత్యశారద, స్నేహా శబరీశ్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్‍గా చాహత్‍ బాజ్‍పాయ్‍ 

వరంగల్‍, వెలుగు: గ్రేటర్‍ వరంగల్‍ లో ఏటా వచ్చే వరదల సమస్యకు శాశ్వత పరిష్కార చర్యలు తీసుకునే అవకాశం మహిళా నేతలు, ఉన్నతాధికారులకు చేతిలోనే ఉంది. 10 నుంచి 15 ఏండ్లుగా వరంగల్‍ మహా నగర కాలనీలు చిన్నపాటి వానలకే నీటమునుగుతున్నాయి. సమైక్య రాష్ట్రంలోని పాలకులు దీనిని పట్టించుకోకపోగా, కొత్త రాష్ట్రంలో 10 ఏండ్లు అధికారంలో ఉన్న గత ప్రభుత్వం సైతం వరదలప్పుడు పర్యటనలు, హామీలతో సరిపుచ్చింది. గ్రేటర్‍ ఏరియా రోజరోజుకూ విస్తరిస్తున్న క్రమంలో సమస్య తీవ్రత పెరిగింది. 

ఈ క్రమంలో ఇటీవల మొంథా తుఫాన్‍ ఎఫెక్ట్​ కారణంగా వరంగల్‍ నగరం ఆగమైంది. మరుసటిరోజే సీఎం రేవంత్‍రెడ్డి వరంగల్‍ సిటీలో పర్యటించి, శాశ్వత పరిష్కార చర్యలకు రిపోర్టులు పంపాలని అధికారులను ఆదేశించారు. వరద కష్టాలకు చెక్‍ పెడుతూ చక్కబెట్టే పనులు ఇప్పడు మహిళల చేతుల్లోనే ఉన్నాయి.

ఫండ్స్​ కోసం మహిళా నేతల ఆరాటం..

గ్రేటర్‍ వరంగల్‍తో పాటు నియోజకవర్గ అభివృద్ధిలో ఎన్నో ప్రాజెక్టులు, మరెన్నో పనులు చేపట్టాల్సి ఉన్నా, వరద సమస్యను ప్రత్యేకంగా చూపడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎక్కువ నిధులు తీసుకురావడానికి ముగ్గురు మహిళా నేతలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. వరంగల్‍ తూర్పులో నాలాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉన్న నేపథ్యంలో మంత్రి సురేఖ ఆ పనుల నిర్వహణకు రూ.158.50 కోట్లు కేటాయించేలా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. 

తుఫాన్‍ ఎఫెక్ట్​ నేపథ్యంలో మరిన్నినిధుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వరంగల్‍ ఎంపీగా కడియం కావ్య డిజాస్టర్‍ మేనేజ్‍మెంట్‍ లెక్కలను తయారు చేయించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు తీసుకురావడంపై స్పెషల్‍ ఫోకస్‍ పెట్టారు. గ్రేటర్‍ మేయర్‍గా సిటీ అభివృద్ధికి, పెండింగ్‍ ప్రాజెక్టులకు అవసరమైన నిధుల కోసం డీపీఆర్‍లు పంపించే పనులకుతోడు వరద నష్ట సహయక కార్యక్రమాల్లో మేయర్‍ వారం నుంచి కాలనీల్లో పర్యటిస్తూ కావాల్సిన చర్యలు తీసుకుంటున్నారు.

కలిసి పనిచేస్తున్న మహిళా ఆఫీసర్లు.. 

ఓరుగల్లును కేసీఆర్‍ ప్రభుత్వం 6 జిల్లాలుగా ముక్కలు చేసిన నేపథ్యంలో ట్రైసిటీని సైతం రెండు జిల్లాలుగా చేసి ఆగం చేశారనే ఆపవాదు ఉంది. సిటీ డెవలప్‍మెంట్‍లో ఏ అభివృద్ధి చేపట్టాలన్నా ఇద్దరు కలెక్టర్లు, ఇరు జిల్లాల ప్రధాన శాఖల అధికారులు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. దీంతో వారిమధ్య సమన్వయం కోల్పోయి విపత్తుల సమయంలోనూ ఎవరికివారుగా పనిచేయడంతో సమస్య పెరిగింది. అయితే వరంగల్‍ పర్యటనలో దీనిని గమనించిన సీఎం రేవంత్‍రెడ్డి రెండు జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు, మున్సిపల్‍ కార్పొరేషన్‍ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంపై ఆగ్రహించారు. 

ఎట్టిపరిస్థితుల్లో రెండు జిల్లాల ఆఫీసర్లు, జీడబ్ల్యూఎంసీ కమిషనర్‍ ఒక కమిటీగా నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం ఆర్డర్స్​ ఎఫెక్ట్​ ఇప్పుడు సిటీలో కనిపిస్తోంది. గ్రేటర్‍ అభివృద్ధి, వరదల వంటి సమస్యల పరిష్కారం విషయాల్లో బల్దియా కమిషనర్‍ చాహత్‍ బాజ్‍పాయ్‍తో కలిసి ఇరు జిల్లాల కలెక్టర్లు సత్యశారద, స్నేహా శబరీశ్​ఒకటిగా మీటింగ్‍ పెట్టి నిర్ణయాలు తీసుకుంటున్నారు. వరదల నేపథ్యంలో సహయక చర్యలు, ఇంటింటా సర్వే, రోడ్లు, డ్రైనేజీలు వంటి నష్టాల అంచనా లెక్కలతోపాటు శాశ్వత పరిష్కార చర్యలకు తీసుకోవాల్సిన పనులపై సీరియస్‍గా పర్యవేక్షణ చేస్తున్నారు.

కీలక నేతలు ముగ్గురు, ఐఏఎస్‍ హోదాలో ముగ్గురు..

గ్రేటర్‍ వరంగల్‍ పరిధిలో వరదల సమస్య పరిష్కరించే హోదాల్లో ఆరుగురు మహిళలే ఉన్నారు. సిటీలోని వరంగల్‍ తూర్పు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొండా సురేఖ రాష్ట్ర మంత్రిగా ఉండగా, వరంగల్‍ ఎంపీగా కడియం కావ్య, గ్రేటర్‍ వరంగల్‍ మేయర్‍గా గుండు సుధారాణి పదవుల్లో ఉన్నారు. అదేటైంలో 2 జిల్లాలు, గ్రేటర్‍ సిటీ పనులను పర్యవేక్షించే బాధ్యతల్లో ముగ్గురు ఐఏఎస్‍లుగా మహిళలే ఉన్నారు. ఇందులో వరంగల్‍ కలెక్టర్‍గా సత్యశారద, హనుమకొండ కలెక్టర్‍గా స్నేహా శబరీశ్​ఉండగా, జీడబ్ల్యూఎంసీ కమిషనర్‍గా చాహత్‍ బాజ్‍పాయ్‍ పని చేస్తున్నారు.