ఆమె ఓటు కోసం పాట్లు.. కామారెడ్డి జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికం

ఆమె ఓటు కోసం పాట్లు.. కామారెడ్డి జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికం
  •     జిల్లాలో మొత్తం ఓట్లు 6,39,730 
  •     పురుషులు 3,07,508 మంది, మహిళలు 3,32,209 మంది
  •     మహిళలు ఓట్లు 24,701 అధికం
  •     అమ్మలక్కలను ప్రసన్నం చేసుకుంటున్న అభ్యర్థులు 
  •     మద్దతు కూడగట్టుకునేందుకు మీటింగ్​ లు 

కామారెడ్డి, వెలుగు :  పంచాయతీ పోరులో మహిళల ఓట్లే కీలకం కానున్నాయి. పురుషుల కంటే అధికంగా ఓట్లు ఉండడంతో మహిళలను ప్రసన్నం చేసుకునే పనిలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు. జిల్లాలో మొత్తం 532 పంచాయతీల్లో 6,39,730 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 3,07,508 మంది, మహిళలు 3,32,209 మంది, ఇతరులు 13 మంది ఉన్నారు. 

పురుషుల కంటే మహిళలు 24,701 మంది ఎక్కువగా ఉండటంతో సర్పంచ్‌‌, వార్డు సభ్యుల అభ్యర్థులు మహిళలను ఆకట్టుకునేలా వ్యూహాలు పన్నుతున్నారు. ఫస్ట్‌‌, సెకండ్‌‌ విడత నామినేషన్‌‌ ప్రక్రియ పూర్తయ్యాక మహిళలతో మీటింగ్​లు నిర్వహిస్తూ మద్దతు కూడగట్టుకుంటున్నారు. 

తొలి విడత ఎన్నికలు జరిగే కామారెడ్డి, దోమకొండ, భిక్కనూరు, రాజంపేట, రామారెడ్డి, సదాశివనగర్, బీబీపేట, పాల్వంచ, మాచారెడ్డి, తాడ్వాయి మండలాల్లో బీడీ కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉంది. బీడీ కార్మికులను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు కుటుంబీకులు, బంధువులు, అనుచరులను రంగంలోకి దించి ఓట్లు రాబట్టేలా ప్లాన్ వేస్తున్నారు. మూడో విడత నామినేషన్‌‌ ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. 

మహిళలకు రిజర్వు అయిన స్థానాలు.. 

532 పంచాయతీల్లో మహిళలకు 242 స్థానాలు రిజర్వు అయ్యాయి. ఇందులో బీసీలకు 55, ఎస్సీ 35, ఎస్టీ 39, జనరల్ 113  స్థానాలు ఉన్నాయి. మహిళలకు కేటాయించిన స్థానాల్లోనే కాకుండా  అన్​రిజర్వుడు స్థానాల్లో కూడా మహిళలు పోటీ చేయవచ్చు.   

మండలాల వారీగా పరిశీలిస్తే..  

జిల్లాలో మిగతా మండలాల కంటే నస్రుల్లాబాద్​లో ఎక్కువ మంది మహిళా ఓటర్లు ఉన్నారు. పురుషుల ఓట్లు 9,981 ఉంటే, మహిళల ఓట్లు11,312 ఉన్నాయి. పురుషుల కంటే 2,231 మహిళా ఓట్లు అధికంగా ఉన్నాయి.  నాగిరెడ్డిపేట మండలంలో పురుషుల ఓట్లు 12,032 మంది ఉంటే, మహిళల ఓట్లు 13,831 ఉన్నాయి.  పురుషుల కంటే మహిళా ఓట్లు1,799 అధికంగా ఉన్నాయి. 

భిక్కనూరు మండలంలో  పురుష ఓటర్లు 18,708 మంది, మహిళలు 20,404 మంది ఉన్నారు. మహిళా ఓటర్ల సంఖ్య 1,696 ఎక్కువగా ఉంది. తాడ్వాయి మండలంలో పురుషులు  12,98 మంది ఉండగా, మహిళలు 13,807 మంది ఉన్నారు.  1509 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.  లింగంపేట మండలంలో పురుషులు 18,334 కాగా, మహిళలు 19,814 మంది ఉన్నారు.

 1,480 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ఎల్లారెడ్డి మండలంలో పురుష ఓటర్లు 9,839 ఉండగా, మహిళల ఓట్లు 11,054 ఉన్నాయి. 1,215 మంది మహిళా ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. మిగతా మండలాల్లో వెయ్యి నుంచి 225 వరకు మహిళా ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. డొంగ్లి మండలంలో మాత్రం  పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య 35 ఎక్కువ. పురుషులు 7,349, మహిళలు 7,384 మంది ఉన్నారు.  

విడతల వారీగా మహిళా ఓటర్ల వివరాలు

 విడత      జీపీలు        పురుషులు          మహిళలు    అధికం

  1                 167              1,18,342          1,30,322          11,980
  2                197                90,739               98,435           7,696
  3               168                98,427             1,03,340           5,623