- గద్వాల జిల్లా అయిజ తహసీల్దార్ ఆఫీస్‌లో ఘటన
అయిజ, వెలుగు : ఆరేండ్లుగా భూ సమస్యను పరిష్కరించడం లేదంటూ ఐదుగురు మహిళలు తహసీల్దార్ ఆఫీస్‌లోనే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన గద్వాల జిల్లా అయిజ తహసీల్దార్ ఆఫీస్‌లో బుధవారం జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణానికి చెందిన రంగు లక్ష్మీదేవి, సుభద్రమ్మ, రోహిణి, రామేశ్వరమ్మ, గోవిందమ్మకు సర్వే నంబర్ 139లో ఒక్కొక్కరికి రెండున్నర ఎకరాల భూమిని 1970లో ప్రభుత్వం ఇచ్చింది. అప్పటి నుంచి సాగు చేసుకుంటూ జీవిస్తున్నారు.
ధరణి ప్రారంభమైన తర్వాత వారికి కొత్త పాస్‌పుస్తకాలు రాలేదు. పాస్ పుస్తకాలు ఇవ్వాలని హైకోర్ట్‌ను ఆశ్రయించగా వీరికి అనుకూలంగా తీర్పు వచ్చింది. బుధవారం తహసీల్దార్ ఆఫీస్‌కు వచ్చి సర్వే రిపోర్ట్ కావాలని తహసీల్దార్ జ్యోతిని అడిగారు. తాను ఇటీవలే ట్రాన్స్‌ఫర్‌పై వచ్చానని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని తహసీల్దార్ సమాధానం చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన మహిళలు ఆరేండ్లుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒకరిపై ఒకరు పోసుకున్నారు.
అక్కడే ఉన్న తహసీల్దార్ జ్యోతితో పాటు కార్యాలయ సిబ్బందిపై పెట్రోలు పడింది. గమనించిన సిబ్బంది మహిళలను వారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మహిళలను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ విషయంపై తహసీల్దార్ మాట్లాడుతూ సదరు మహిళలకు చెందిన భూమిని గతంలోనే రెసిడెన్షియల్ స్కూల్‌కు కేటాయించారని, ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
