మహిళా రిజర్వేషన్ బిల్లు రాజీవ్ కల.. మేం మద్దతిస్తాం: సోనియా

మహిళా రిజర్వేషన్ బిల్లు రాజీవ్ కల..  మేం మద్దతిస్తాం: సోనియా

మహిళా రిజర్వేషన్ బిల్లు రాజీవ్ గాంధీ కల అని.. బిల్లు ఆమోదం పొందితే ఆ కల నెరవేరుతుందన్నారు  కాంగ్రెస్  ఎంపీ సోనియా గాంధీ.  నారీ శక్తి వందన్‌ అభియాన్‌ 2023 బిల్లుకు   కాంగ్రెస్ మద్దతిస్తుందన్నారు.  లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన సోనియా..  మహిళా రిజర్వేషన్ బిల్లును మొదట ప్రవేశ పెట్టింది తామేనన్నారు. గతంలో ఈ బిల్లును అడ్డుకున్నారని.. ఇప్పటికైనా బిల్లు చర్చకు రావడంతో సంతోషంగా ఉందన్నారు. 

 కోటా అమల్లోకి వస్తేనే రాజీవ్ కల నిజమవుతుందన్నారు సోనియా. నారీ శక్తి బిల్లును వెంటనే అమల్లోకి తేవాలన్నారు. తక్షణమే  కుల జనగణన చేపట్టాలన్నారు. మహిళలు ఇంకెన్నాళ్లు ఎదురు చూడాలన్నారు. త్వరగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళల జాబితా తయారు చేయాలన్నారు.

స్థానిక సంస్థల్లో మహిళలకు రాజీవ్  గాంధీ రిజర్వేషన్  కల్పించారని చెప్పారు సోనియా గాంధీ.  పీవీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ  రిజర్వేషన్లను అమలు చేసిందన్నారు.   అందువల్లే  ఈ రోజు దేశంలో 15 లక్షల మంది మహిళలు అధికారాన్ని  దక్కించుకున్నారని తెలిపారు.   భారత నారీ శక్తి ఎంతో  ఘనమైనదని కొనియాడారు.  స్త్రీ శక్తిని కొలవడం అసాధ్యమని..  వంటింటి నుంచి  ప్రపంచ వేదికల వరకు  భారత మహిళల పాత్ర ఎంతో ఉందన్నారు. 

 మహిళలు  వారి స్వార్థం గురించి ఏనాడు ఆలోచించరన్నారు సోనియా.  స్త్రీల త్యాగులు ఎనలేనివని.. ఆధునిక భారత నిర్మాణంలో పురుషులతో కలిసి పురుషులు పోరాడారని చెప్పారు.  స్వాతంత్ర్య సమరంలో మహిళలు పోరాడారని..  సరోజిని నాయుడు, సుచేత కృపలానీ, అరు అసఫ్ అలీ, విజయలక్ష్మీ  పండిత్ వంటి వారెందరో దేశం కోసం పోరాడారని చెప్పారు.