- పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
హైదరాబాద్, వెలుగు: త్వరలో ఇప్పపువ్వు వంటనూనె తదితర ఆహార ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్లోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. శనివారం ములుగు జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఇప్పపువ్వుకు ఉన్న పోషక విలువలను ప్రజలకు చేరవేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు.
ఈ రంగంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే మహిళా సంఘాలు, యువ పారిశ్రామికవేత్తలకు రుణాలు, శిక్షణ, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. శిల్పారామంలోని ఇందిరా మహిళా శక్తి బజార్‌లో ఇప్పపువ్వుతో తయారైన ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తోందని
పేర్కొన్నారు.
మహిళా సమాఖ్య భవనాలను త్వరగా పూర్తిచేయాలి..
గ్రామ మహిళా సమాఖ్య భవనాల నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. శనివారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సెర్ప్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు.
ఈ భవనాలు కేవలం నిర్మాణాలు కాకుండా మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకలుగా నిలుస్తాయని చెప్పారు. సమావేశంలో పీఆర్, ఆర్డీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిశోర్, కమిషనర్ దివ్యా దేవరాజన్ తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు ఉండబోదు
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లు లేని గ్రామం ఉండకూడదనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గుర్రంపేటలో ఏర్పాటు చేసిన ప్రజాదర్బార్‌లో ఆమె మాట్లాడారు. మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం ప్రయార్టీ ఇస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జాయింట్ కలెక్టర్ అశోక్ కుమార్, జడ్పీ సీఈవో విజయలక్ష్మి పాల్గొన్నారు.
