మహిళల ధైర్యం, నిబద్ధతతో రాణించాలి: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

మహిళల ధైర్యం, నిబద్ధతతో రాణించాలి: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
  • మహిళా వర్సిటీలో ఘనంగా స్నాతకోత్సవ వేడుకలు

బషీర్​బాగ్, వెలుగు: మహిళల ధైర్యం, నిబద్ధతతో సమాజాభివృద్ధికి దోహదపడాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. హైదరాబాద్ కోఠిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీలో 20వ స్నాతకోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులుగా శాంత బయోటెక్ వ్యవస్థాపకులు, పద్మ భూషణ్ కెవి వరప్రసాద్ రెడ్డి , గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఓయూ, మహిళా వర్సిటీ వీసీలు ప్రొ. కుమార్, ప్రొ. సూర్యధనుంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా 763 మంది విద్యార్థినులు డిగ్రీలు అందుకోగా, 13 మందికి గోల్డ్ మెడల్స్ అందజేశారు.

గవర్నర్ మాట్లాడుతూ.. 1924లో 16 మందితో ప్రారంభమైన కోఠి మహిళా కళాశాల నేడు 8,000 మంది విద్యార్థినులతో అద్భుత సంస్థగా ఎదిగిందన్నారు.  సావిత్రిబాయి పూలే ఆశయాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సంకల్ప బలంతో ఏదైనా సాధ్యమని, తల్లి ప్రోత్సాహంతో తాను ఈ స్థాయికి ఎదిగానని వరప్రసాద్ రెడ్డి తెలిపారు. విద్య కేవలం చదవడం, రాయడం కాదని, సమాజానికి ఉపయోగపడాలని సూచించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.