మహిళలు.. ఉపాధిలో మహారాణులు

మహిళలు.. ఉపాధిలో మహారాణులు

ఓ వైపు ఇంటిని చక్కబెడుతూనే.. మరో వైపు నచ్చిన వ్యాపకాన్ని వ్యాపారంగా మార్చుకుంటున్నారు గృహిణులు. ఇంటిపట్టునే ఉంటూ ఇన్నొవేటివ్​గా ఆలోచించి వ్యాపార రంగంలో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఖాళీ సమయాన్ని వృథా చేయక తమలోని కళలను బయటకు తీసి పేరుతెచ్చుకుంటున్నారు. గృహిణుల్లో చాలామంది ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ తయారుచేయడంపై దృష్టిపెట్టడం విశేషం. మట్టితో ఆభరణాలు.. వేస్టేజ్, ఆర్గానిక్ వస్తువులతో బొమ్మలు, డెకరేటివ్ ఐటమ్స్.. క్లాత్‌‌తో దేవుడి బొమ్మలు, జూట్‌‌తో బ్యాగులు ఇలా ఎన్విరాన్మెంటల్ ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నారు. పలువురు సొంతంగా ఈ చిన్న వ్యాపారాలు చేస్తుండగా, ఇంకొందరు ఇతర మహిళలకు శిక్షణ ఇస్తూ ఉపాధి కల్పిస్తున్నారు. ఇవ్వాల ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం. హైదరాబాద్, వెలుగు

  • ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ తయారు చేస్తూ సంపాదన
  • మరికొంత మందికి ఉపాధినిచ్చి చేయూత
  • ఆన్​లైన్, ఆఫ్​లైన్​లో అమ్మకాలు

మహిళా దివ్యాంగులకు ఆసరాగా..

తార్నాకకు చెందిన సింధు దివ్యాంగులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ‘మనోవాంఛ’ అనే ఆర్గనైజేషన్​ను మొదలుపెట్టారు. వేస్టేజ్‌‌తో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తయారు చేయించి వారికి ఉపాధి కల్పిస్తున్నారు. వాటర్ బాటిల్స్, పూలకుండీలు, అద్దాలు, పేపర్లు, గోనె సంచి తాళ్లతో గిఫ్ట్స్, డెకరేటివ్ ఐటమ్స్ తయారు చేస్తూ వారికి నేర్పిస్తున్నారు. సిటీలోని పలు ఎగ్జిబిషన్​లలో స్టాళ్లు ఏర్పాటు చేసి ప్రొడక్ట్స్ ని అమ్ముతున్నారు. అంతేకాకుండా ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో ‘మనోవాంఛ’ పేరుతో ఓ పేజీ ఓపెన్ చేసి సేల్ చేస్తున్నారు. తొందరలోనే స్టోర్​ను ప్రారంభించి మరింత మందికి ఉపాధి కల్పించాలనే ఆలోచనతో ఉన్నట్లు ఆమె తెలిపారు. 

మట్టితో ఆభరణాల తయారీ..

మహిళలకు ఆభరణాలంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అందరిలా కాకుండా విభిన్నంగా ఉండేలా మట్టితో జువెలరీ తయారు చేయడం ప్రారంభించారు 
వనస్థలిపురానికి చెందిన ఉమా. ఒకప్పుడు ఇంట్లో ఖాళీ సమయాల్లో పెయింటింగ్స్, డ్రాయింగ్స్ వేస్తూ కాలక్షేపం చేసేవారు. అయితే ఫ్యాషన్ జువెలరీలో సరికొత్త మార్పులు వస్తుండటంతో తాను కూడా చేయాలని నిర్ణయించుకున్నారు. పెయింటింగ్స్ లో కలర్ కాంబినేషన్ లో అవగాహన ఉండటంతో జువెలరీ మేకింగ్ ప్రారంభించారు. మొదట సిల్క్ థ్రెడ్‌‌తో ఆభరణాలు చేసిన ఆమె ఆ తర్వాత టెర్రకోట వైపు మళ్లారు. మట్టితో నెక్లెస్‌‌లు, జుంకీలు చేయడం మొదలుపెట్టారు. వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు. అలా ఇప్పుడు జుంకీ పేరుతో ఆభరణాలను సేల్ చేస్తున్నారు. 

గిన్నిస్​ వరల్డ్ ​రికార్డ్ ఆమె సొంతం

బేంగపేట బీఎస్ మక్తాలో ఉంటున్న జయశ్రీ వాసుదేవన్ పుట్టి పెరిగింది తమిళనాడులో. కొన్నేండ్ల కిందట సిటీలో స్థిరపడిన ఆమె 2013 నుంచి బొమ్మలు, హ్యాండీ క్రాఫ్ట్స్ తయారు చేయడం ప్రారంభించారు. దేవుని బొమ్మలు, చిన్న పిల్లలు ఇష్టపడే బార్బీ బొమ్మలు, ఎకో ఫ్రెండ్లీ బుట్టలు, జూట్ బ్యాగులు, బొమ్మల కొలువులో ఏర్పాటు చేసుకునే విభిన్న రకాల ప్రతిమలను రూపొందిస్తున్నారు. స్పెషల్ థీమ్‌‌తోనూ జయశ్రీ బొమ్మలను తయారు చేసి ఇస్తున్నారు. సంస్కృతి డాల్స్ అండ్ క్రాఫ్ట్స్ అసోసియేషన్‌‌లో దేశవ్యాప్తంగా ఉన్న డాల్స్, క్రాఫ్ట్స్ తయారీదారులు 2019లో బెంగుళూరులో 2,196 బొమ్మలతో కొలువుపెట్టగా.. వాటిలో జయశ్రీ రూపొందించిన 30 బొమ్మలున్నాయి. ఇందుకుగానూ ఆమె గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నారు. బొమ్మలను తయారుచేయడం స్ట్రెస్ ఫ్రీగా ఉంటుందని జయశ్రీ అంటున్నారు. ఆసక్తి ఉన్న మహిళలకు శిక్షణ కూడా ఇస్తున్నట్లు తెలిపారు.

మౌత్ ​పబ్లిసిటీ, ఆన్​లైన్ ​బిజినెస్

గృహిణుల ఆలోచనా విధానం మారుతోంది. సమయం మొత్తం ఇంటి పనులు, టీవీ సీరియళ్లపైనే కాకుండా.. దొరికిన సమయాన్ని ఎలా క్యాష్ చేసుకోవాలా అని ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగానే బిజినెస్ ఫ్రమ్ హోమ్ ఆలోచనతో ముందుకెళ్తున్నారు. తమకు తెలిసిన, నచ్చిన పనులతోపాటు యూట్యూబ్‌‌లో చూస్తూ వస్తువులు తయారుచేస్తూ స్నేహితులు, బంధువులకు సేల్ చేస్తున్నారు. వారి ద్వారా మౌత్ పబ్లిసిటీ పొందుతున్నారు. ఆన్​లైన్ బిజినెస్​లు కూడా చేస్తూ దూసుకెళ్తున్నారు.