నోటీసులు తీసుకోరు..విచారణకు రారు..సాదాబైనామాల పరిష్కారానికి చిక్కులు..

 నోటీసులు తీసుకోరు..విచారణకు రారు..సాదాబైనామాల పరిష్కారానికి చిక్కులు..
 
  • భూములు కొన్నవారు తప్ప ముందుకురాని అమ్మకందారులు
  • నోటీసులు తీసుకునేందుకు నిరాకరణ
  • ఫీల్డ్​ విజిట్​కు సిద్ధమవుతున్న రెవెన్యూ అధికారులు
  • మహబూబ్​నగర్​ జిల్లాలో పరిస్థితి

‘మహబూబ్​నగర్​జిల్లా గూడూరు శివారులో  ఓ రైతుకు మూడెకరాల భూమి ఉండగా.. అది ఆయన తల్లి పేరిట ఉంది. కానీ ఆమె చనిపోయింది. 2005 ​లో సదరు రైతు ఈ భూమిని రూ.80 వేలకు కౌకుంట్ల మండలం తిర్మలాపూర్ కు చెందిన గోవర్ధన్​రెడ్డి భార్య జయమ్మకు అమ్మాడు. పట్టా అడిగితే.. విరాసత్​ చేసుకున్న తర్వాత చేయిస్తానని సాదాబైనామా రాసిచ్చాడు. ఇప్పటివరకు పట్టా చేసివ్వలేదు. సోమవారం తహసీల్దార్​ ఆఫీస్​కు హియరింగ్​ కోసం పిలిస్తే రాలేదు. జయమ్మ భర్త ఆధారాలను ఆఫీసర్లకు అందించాడు.’

‘దమగ్నాపూర్ కు చెందిన ఓ రైతుకు 2.22 ఎకరాల భూమి ఉంది. 1996లో ఇదే గ్రామానికి చెందిన రైతు రామయ్యకు విక్రయించి, సాదాబైనామా రాసిచ్చాడు. అయితే రామయ్య పట్టా చేసుకోలేదు. కానీ మోకా మీద ఉన్నాడు. ఇప్పుడు ఈ భూమి సాదాబైనామా రాసిచ్చిన రైతు మనువరాలి పేరిట పట్టా అయింది. సాదాబైనామా రాసిచ్చిన, రాయించుకున్న రైతులు చనిపోయారు. రామయ్య కొడుకు పెద్ద అంజన్న ఈ భూమి తమదని, 2020లో సాదాబైనామా క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేశాడు. ఆఫీసర్లు సదరు రైతు మనవరాలికి నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించడం లేదు.’

మహబూబ్​నగర్​, వెలుగు: సాదాబైనామాల పరిష్కారానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భూమిని కొన్నట్లు కాగితం రాయించుకున్నవారు.. డబ్బులు తీసుకొని భూములు అమ్మినవారు రెవెన్యూ ఆఫీసుల్లో జరిగే హియరింగ్​కు రావాల్సి ఉంటుంది. కానీ విక్రయించినవారు రావడం లేదు. కొనుగోలు చేసినవారే వస్తుండటంతో పరిష్కారానికి అడుగు ముందుకు పడటం లేదు.

ధరణి స్థానంలో భూభారతి..

ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం సాదాబైనామాల క్రమబద్ధీకరణ చేపట్టేందుకు నిర్ణయించింది. 2020 నుంచి సాదాబైనామాల క్రమబద్ధీకణ కోసం చేసుకున్న అప్లికేషన్లను పరిష్కరించాలని రెవెన్యూ డిపార్ట్​మెంట్​ను ఆదేశించింది. ఈ క్రమంలో ఒక్కో అప్లికేషన్​కు సంబంధించి భూమి అమ్మిన వారికి, కొన్న వారికి రెవెన్యూ సిబ్బంది వారి గ్రామాలకు వెళ్లి నోటీసులు ఇస్తున్నారు. భూములు కొన్నవారు తీసుకుంటుండగా.. అమ్మినవారు నిరాకరిస్తున్నారు.

 ఆ భూములను తాము ఎవరికీ అమ్మలేదనివాదనకు దిగుతున్నారు. మరికొందరు నోటీసులు తీసుకుంటున్నా హియరింగ్​కు హాజరు కావడం లేదు. భూమి కొనుగోలు చేసినవారు మాత్రమే వస్తున్నారు. వారి వద్ద నుంచి ఆఫీసర్లు సాదాబైనామాకు సంబంధించిన కాపీలు, ఇతర ఆధారాలు సేకరిస్తున్నారు. తహసీల్దార్, ఆర్ఐ, సిబ్బంది  ఫీల్డ్​ విజిట్​కు వెళ్లి  మోకాలో ఎవరున్నారు? ఏ పంటలు వేస్తున్నారనే వివరాలను సేకరించేందుకు సిద్ధమవుతున్నారు. 

వారసుల పేరు మీదే పట్టా 

2014కు 12 ఏండ్లకు ముందు నుంచి ఉన్న సాదాబైనామాలను క్లియర్​ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే 20, 30 ఏండ్ల కింద సాదాబైనామాలు రాయించుకున్నవారు.. భూమి విక్రయించిన రైతుల మీద నమ్మకంతో పాసు పుస్తకాలకు తీసుకోలేదు. కేవలం పహణీలో కాస్తుదారు ఎవరు? ఏ పంట వేశారనే వివరాలను మాత్రమే నమోదు చేయించుకున్నారు. ఇదే ఇప్పుడు సమస్యగా మారింది. సాదాబైనామా రాసిచ్చిన రైతులు చనిపోవడంతో వారి వారసులు భూములను తమ పేరిట పట్టా చేయించుకున్నారు. 2017లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో పాత ఆర్​వోఆర్​లో ఉన్న రైతుల వివరాల ప్రకారం.. వారి వారసులకు విరాసత్​ చేసి పట్టాదారు పాస్తు పుస్తకాలను జారీ చేసింది. అవి తీసుకున్నవారు ఆ భూములు తమవేనని వాదిస్తున్నారు. 

డబ్బులు ఇవ్వాలని డిమాండ్!

ఏండ్ల కింద రూ.1,000కి, రూ.5 వేలకు, రూ.10 వేలకు రైతులు సాదాబైనామాలు రాసిచ్చారు. ఇప్పుడా భూములు పట్టణాల పరిధిలో రూ.కోటి పైనే ధర పలుకుతున్నాయి. అర్బన్​, రూరల్​ ఏరియాల్లో రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు, గ్రామాలకు వెళ్లే ప్రధాన రోడ్ల వెంట ఉన్న భూములు రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు పలుకుతున్నాయి. దీంతో ఈ భూములను సాదాబైనామా రాయించుకున్న వారికి అప్పగించేందుకు కొందరు వారసులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఉన్న మార్కెట్​ వాల్యూకు 75 శాతం డబ్బులు చెల్లిస్తే భూముల క్రమబద్ధీకరణకు సహకరిస్తామని చెబుతున్నారని కొందరు రైతులు అంటున్నారు.

ఆధారాలు తీసుకుంటున్నాం

భూభారతి చట్టం గైడ్​ లైన్స్​ప్రకారం రైతుల నుంచి సాదాబైనామాలకు సంబంధించిన ఆధారాలు తీసుకుంటున్నాం.  త్వరలో మోకాలో ఎవరున్నారనేది ఫీల్డ్ విజిట్​ చేసి వివరాలు సేకరిస్తాం. రిపోర్టును ఉన్నతాధికారులకు అందిస్తాం. -ఎల్లయ్య, తహసీల్దార్, చిన్నచింతకుంట