V6 News

పల్లె ఓటర్లు 1.66 కోట్లు.. పంచాయతీ పోరులో మహిళా ఓటర్లదే పైచేయి.. పురుషుల కంటే 3.70 లక్షల ఓట్లు ఎక్కువ

పల్లె ఓటర్లు 1.66 కోట్లు.. పంచాయతీ పోరులో మహిళా ఓటర్లదే పైచేయి.. పురుషుల కంటే 3.70 లక్షల ఓట్లు ఎక్కువ
  • రాష్ట్రవ్యాప్తంగా 1.12 లక్షల పోలింగ్ స్టేషన్లు.. 
  • పోలింగ్ స్టేషన్లు, ఓటర్ల వివరాలను 
  • వెల్లడించిన ఎస్ఈసీ  
  • తొలి విడత ఎన్నికలకు చకచకా ఏర్పాట్లు

హైదరాబాద్, వెలుగు: తొలి విడత పల్లెపోరుకు నేటితో ప్రచారం ముగియనున్నది. 11న తొలివిడత పోలింగ్​కు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) చకచకా ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా సోమవారం గ్రామీణ ఓటర్లు, పోలింగ్ స్టేషన్ల వివరాలను ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 564 మండలాల్లోని 12,723 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా.. మొత్తం 1,66,48,496 (1.66 కోట్ల పైన) ఓటర్లు ఉన్నట్లు లెక్క తేల్చింది. ఇందులో 81,38,937 మంది పురుషులు, 85,09,059 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అంటే పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 3.70 లక్షల మంది అధికం. ఇతరలు 500 మంది ఓటర్లు ఉన్నారు.

మూడు విడతల్లోనూ అతివలదే హవా..

తొలి విడతలో 189 మండలాల్లోని 4,235 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా..  ఈ విడతలో మొత్తం 56,19,430 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు 27,41,070  ఉంటే.. మహిళలు 28,78,159 మంది, ఇతరులు 201 మంది ఉన్నారు. రెండో విడతలో అత్యధికంగా 193 మండలాల్లో 4,331 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ విడతలో  57,22,665  మంది ఓటర్లు ఉండగా.. మహిళా ఓటర్లు పురుషుల కంటే సుమారు లక్షా 30 వేల మంది ఎక్కువగా ఉన్నారు. 

పురుషులు 27,96,006 మంది, మహిళలు 29,26,506 మంది ఇతరులు 153 మంది ఉన్నారు. చివరి విడతలో 182 మండలాల్లో 4,157 పంచాయతీలకు ఎలక్షన్స్ జరుగుతాయి. 53,06,401 ఓటర్లు తమ తీర్పు ఇవ్వనున్నారు. పురుషలు 26,01,861, మహిళలు 27,04,394, ఇతరులు 146 మంది ఉన్నారు.

లక్ష దాటిన పోలింగ్ స్టేషన్లు.. 

పంచాయతీ ఎన్నికలను  పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రశాంతంగా ఓటింగ్ జరిగేలా రాష్ట్రవ్యాప్తంగా 1,12,382 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మొదటి విడతలో 37,562 స్టేషన్లు, రెండో విడతలో అత్యధికంగా 38,337 స్టేషన్లు, మూడో విడతలో 36,483 స్టేషన్లను రెడీ చేశారు. పోలింగ్ స్టేషన్ల సంఖ్య భారీగా ఉండటంతో బ్యాలెట్ బాక్సుల తరలింపు, సిబ్బంది నియామకం అధికారులకు కత్తిమీద సాములా మారనున్నది.

  • మొత్తం ఓటర్లు: 1.66 కోట్లు
  • మహిళా ఓటర్ల ఆధిక్యం: 3.70 లక్షలు
  • అత్యధిక పంచాయతీలు: 4,331 (రెండో విడత) 
  • ఇతర ఓటర్లు: 500 మంది