బతుకమ్మ చీరలకు కరువైన ఆదరణ

బతుకమ్మ చీరలకు కరువైన ఆదరణ

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చివరికి బూడిదలో పోసిన పన్నీరులా అయినట్టు తెలుస్తోంది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వివేకానంద నగర్ డివిజన్ లో  ఉదయం 8గంటల నుండి పంపిణీ కార్యక్రమం పనులు మొదలయ్యాయి. అయితే మధ్యాహ్నం12 అవుతున్నా మహిళలు ఆసక్తి చూపలేదు. దీంతో కార్యక్రమానికి ఏర్పాటు చేసిన టెంట్లు, కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. ఈ నేపథ్యంలో డివిజన్ కార్పొరేటర్, కార్పొరేటర్ భర్తతో సహా పలువురు నాయకులు ఏం చేసేది లేక వెనుదిరిగి వెళ్ళిపోయారు. దీంతో ఈ కార్యక్రమం అర్థాంతరంగా ముగిసిపోయింది. 

దసరా, బతుకమ్మ పండుగల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతి యేడూ చీరలను పంపిణీ చేస్తూ వస్తోంది. అందులో భాగంగా ఈ సారి కూడా చీరల తయారీ కోసం రూ.330.73 కోట్లు ఖర్చు చేసినట్లు ఇటీవలే మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా రేషన్ కార్డులో పేరు ఉండి 18 ఏళ్లు పైబడిన అర్హులైన ప్రతి మహిళకూ ప్రతీ సంవత్సరం చీరలు అందిస్తున్నారు. ఎప్పటిలాగే ఈ సారీ దీని కోసం ప్రభుత్వ యంత్రాంగం పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లు చేసింది. కానీ కొన్నిచోట్ల మహిళలు ఈ చీరలు తీసుకోవడానికి ఆసక్తి చూపకపోవడం గమనార్హం.