అది ఎండాకాలం. మధ్యాహ్నం ఒంటిగంట దాటింది. ఆమె రోజూలాగే పొలం దగ్గర ఉన్న తండ్రికి సద్ది తీసుకెళ్తుంది. ఆ దారి చట్టమైన చెట్లు, పుట్టల మధ్య నుంచి ఉంది. ఆమె ఆ దారిలో నడుస్తుండగా చిరుతపులి ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. అప్పుడు ఆమె దగ్గర ఏ ఆయుధాలు లేవు. కానీ, గుండె నిండా ధైర్యం ఉంది. పక్కనే ఉన్న ఒక కర్ర తీసుకుని చిరుతపై విరుచుకుపడింది. చిరుతను చిత్తు చేసింది. కాళ్లతో తొక్కి పట్టి చంపేసింది. ఆ మండుటెండలో అప్పుడే అటువైపు ఆకలి దప్పులతో అలమటిస్తూ గుర్రంపై వచ్చాడు ఒక యువకుడు. ఆమె ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె అతడికి మంచినీళ్లు, సంగటి ఇచ్చి సద్దిమూట నెత్తిన పెట్టుకుని వెళ్లిపోయింది. ఆ యువకుడే పాపన్నపేట సంస్థానాధీశుడు మొదటి నర్సింహారెడ్డి. ఆ వీరవనితే రాణి శంకరమ్మ' దీన్ని కథలు కథలుగా చెప్పుకుంటారు మెదక్ వాసులు. విమెన్స్ డే సందర్భంగా ఆమె గురించి ప్రత్యేక కథనం
..రాణి శంకరమ్మ ఒక సాధారణ రైతు సంగారెడ్డి కూతురు తల్లి రాజమ్మ. క్రీ.శ. 1715లో గాడిచెర్ల గ్రామంలో పుట్టింది.. శంకరమ్మ ధైర్య సాహసాలకు మెచ్చి పాపన్నపేటను పాలించే మొదటి నరసింహారెడ్డి పెండ్లి చేసుకున్నాడు. ఆయన చనిపోయిన తర్వాత క్రీ.శ. 1764 నుంచి 74 వరకు రాణి శంకరమ్మ పాపన్నపేటని పాలించింది.
ముగ్గురు రాణులు
నైజాం రాజ్యంలో ఉన్న ప్రాచీన సంస్థానాల్లో పాపన్నపేట ఒకటి. ఇది ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉంది. విస్తీర్ణంలో కూడా చాలా పెద్దది. దీన్ని అందోలు రాజధానిగా క్రీ.శ.1400లో రామినేడు స్థాపించాడు. ఈమె కంటే ముందే లింగాయమ్మ. రెండో లింగాయమ్మ(రామాయమ్మ) పాలించారు.
ఈమె సంస్థానానికి పన్నెండో పాలకురాలు. శంకరమ్మ తర్వాత కూడా మరో ముగ్గురు పాలించారు. వాళ్లే శివాయమ్మ, పార్వతీదేవి, రాణి వెంకట లక్ష్మాయమ్మ. ఈ సంస్థానం క్రీ.శ. 1707 నాటికి దక్కన్లో అతిపెద్దది. శంకరమ్మ పాలనలో ఎంతో అభివృద్ధి చెందింది. ఆమె రాజ్యాన్ని విస్తరించింది. సంస్థానాన్ని పునర్నిర్మించింది. ఆమె ఇప్పటి మహిళలకే కాదు ప్రభుత్వాలకూ మార్గదర్శిగా నిలిచింది.
రాయ బాగిన్ బిరుదు
మొదటి నర్సింహారెడ్డిని సిద్ధిఖీ సోదరులు. విషప్రయోగం చేసి చంపడంతో శంకరమ్మ సంస్థానం బాధ్యతలు చేపట్టింది. అప్పటికీ సంస్థానం పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.
అయినా.. ఆమె సమర్థవంతంగా పాలించారు.
వ్యవసాయానికి ప్రాధాన్యం ఇచ్చారు. చెరువులు, కాలువలు తవ్వించారు. సంక్షోభసమయంలో రైతులకు పన్ను మినహాయింపు ఇచ్చారు. పక్కనే ఉన్న మహారాష్ట్రలో పాలకులు 'చౌతు సర్వశముఖి' లాంటి పన్నులు వేసి ఇబ్బంది పెట్టేవాళ్లు. దాంతో శంకరమ్మ వాళ్లపై దండెత్తింది.
ఈమె యుద్ధ తంత్రం, వీరత్వం ముందు వాళ్లు నిలవలేకపోయారు. అందరినీ ఓడించి ప్రజలను విముక్తులను చేసింది. నైజాం రాజుకు చాలా సార్లు సైనిక సాయం చేసినట్లు చరిత్రకారులు చెప్తున్నారు. తర్వాత ఒకసారి మరాఠీలు నిజాం రాజ్యంపై యుద్ధానికి వచ్చారు. నారాయణఖేడ్ ప్రాంతంలో బస చేశారు.
తన రాజ్యాన్ని, ప్రజలను రక్షించాలన్న ఉద్దేశంతో తన దగ్గర తక్కువ సైన్యం ఉన్నా ఎత్తుకు పై ఎత్తులు వేసింది. పీష్వాలకు మూడు చెరువుల నీళ్లు తాగించింది. శంకరమ్మ బుద్ధి బలానికి తట్టుకోలేక శత్రు సైన్యాలు వెనుదిరగక తప్పలేదు. అప్పుడు నిజాం ప్రభువు ఈమె ధైర్యసాహసాలకు మెచ్చి 'రాయ బాగిన్'అనే బిరుదు ఇచ్చాడు. ఈ బిరుదే వాడుకలో 'రాయభేగం' అయ్యింది.
సంఘ సంస్కర్త
రాణి శంకరమ్మ గొప్ప సంఘ సంస్కర్త కూడా. ఆమె కుల వివక్షను వ్యతిరేకించేది. అందుకే అంటరాని కులానికి చెందిన పాపన్నను తన సేనాధిపతిగా నియమించుకుంది. ప్రజలకు కేవలం రక్షణ కల్పించడమే కాదు. వాళ్లను సంస్కరించింది కూడా ఆమే. అంతేకాదు. సంస్థానంలోని అన్ని గ్రామాలకు వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేది.
జానపద సాహిత్యం
రాణి శంకరమ్మపై జానపద సాహిత్యం ఉంది. అప్పట్లో ఆమె చేసిన అభివృద్ధి పనులు. ఆమె విజయాలు, చరిత్రపై బతుకమ్మ, కోలాటం పాటలు పాడుకునేవాళ్లు ప్రజలు. మెదక్ ప్రాంతంలో అవి ఇప్పటికీ వినిపిస్తుంటాయి. ఆమె గురించి తెలిపే ఒక ఉయ్యాల పాటను తెలంగాణ ప్రభుత్వం పాఠ్య పుస్తకాల్లో కూడా ప్రచురించింది.
తిరుగులేని రాణి
శంకరమ్మకు సంతానం లేకపోవడంతో దోమకొండ సంస్థానానికి చెందిన సదాశివారెడ్డిని దత్తత తీసుకుంది. ఆ సమయంలోనే ఆమె ఒకసారి కాశీకి వెళ్లింది. అప్పుడు సంస్థానంలో ఆక్రమణలు పెరిగాయి. దాంతో ఆమె కాశీ నుంచి వచ్చిన వెంటనే మళ్లీ కత్తి పట్టి శత్రువులను మట్టుపెట్టింది. చేజారిపోతుంది అనుకున్న సంస్థానాన్ని దక్కించుకుంది. సదాశివారెడ్డిని కూడా సమర్ధవంతమైన పాలకుడిగా తీర్చిదిద్దింది.
దక్కన్ చరిత్రలో సముచిత స్థానం దక్కించుకుంది. తిరుగు లేని రాణిగా పేరు తెచ్చుకుంది. అనారోగ్యంతో క్రీ.శ.1774లో చనిపోయింది.హైద్రాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనం అయ్యేటప్పుడు కూడా ఈ సంస్థానాన్ని మహిళే పాలించింది. రాణి శంకరమ్మ చరిత్ర 'మెతుకు మాణిక్యం రాణి శంకరమ్మ' పేరుతో ఒక నవలగా వెలువడింది. ప్రముఖ రచయిత ఎస్. ఎం.ప్రాణావు దీన్ని రాశారు.
