
హైదరాబాద్ సిటీ, వెలుగు: ‘మహిళా జన్ సున్ వాయి’ తో మహిళల సమస్యలను పరిష్కరిస్తున్నామని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ అర్చనా మజుందార్ తెలిపారు. జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో సోమవారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో అర్చనా మజుందార్ నేతృత్వంలో ‘మహిళా జన్ సున్వాయి’ కార్యక్రమం నిర్వహించారు.
మూడేండ్ల పాటు పెండింగ్‌లో ఉన్న గృహహింస, వరకట్న వేధింపులు, లైంగిక వేధింపులు, ఎన్ఆర్ఐ వైవాహిక వివాదాల వంటి 56 ఫిర్యాదులకు పరిష్కారం చూపామని అర్చన తెలిపారు. విదేశాల్లో స్థిరపడిన తర్వాత భర్తల నుంచి వేధింపులు ఎదుర్కొన్న చాలా మంది మహిళలు తమ సమస్యల గురించి వివరించారని చెప్పారు.
ఈ కేసులపై వారం రోజుల్లో యాక్షన్ తీసుకోవాలని అధికారులను అర్చన ఆదేశించారు. అంతేకాకుండా మహిళల సమస్యల పరిష్కారానికి పోలీసులకు, ఇతర ఏజెన్సీలకు మధ్య సమన్వయం ఉండాలన్నారు. సీఐడీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ చారు సిన్హా , రాచకొండ సీపీ జి.సుధీర్ బాబు, సైబరాబాద్ సీపీ అవినాశ్ మోహంతి, రంగారెడ్డి కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.