అగ్రకులాల కోసమే మహిళా రిజర్వేషన్ బిల్లు : విశారదన్ మహారాజ్

అగ్రకులాల కోసమే మహిళా రిజర్వేషన్ బిల్లు : విశారదన్ మహారాజ్
  • 33 శాతంలో 90 శాతం ఉప కులాలకు కేటాయించాలి
  • డీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహారాజ్

హైదరాబాద్, వెలుగు: మహిళ రిజర్వేషన్ బిల్లు పూర్తిగా అగ్ర కులాలకు చెందిన మహిళల కోసమేనని ధర్మసమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ అభిప్రాయపడ్డారు. ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని బుధవారం విడుదల చేసిన ఓ  ప్రకటనలో తెలిపారు. ఈ బిల్లు ద్వారా అగ్ర కులాలకు చెందిన మహిళలే పార్లమెంట్, అసెంబ్లీకి వెళ్తారని ఆయన అన్నారు. ఈ బిల్లులో సవరణలు చేయాలని,  33 శాతం మహిళ రిజర్వేషన్​లో 90 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలకు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇండియా కూటమి, బీఆర్ఎస్, బీఎస్పీలు  ఉప కోటాను కోరకపోవడం బాధాకరమన్నారు. సమాజ్ వాదీ పార్టీ మాత్రమే ఉప కోటాను కోరిందని.. ఇందుకు ఆ పార్టీకి ధన్యవాదాలు చెబుతున్నట్లు ఆయన తెలిపారు.  33 శాతం రిజర్వేషన్లలో 90 శాతం ఉప కులాలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అన్నిజిల్లాల్లో ఈనెల 21న ఆందోళనలు చేపడుతున్నట్లు విశారదన్ మహారాజ్ వెల్లడించారు.  రిజర్వేషన్ బిల్లు దిష్టిబొమ్మని దగ్దం చేస్తామని.. ఇండియా, బీఆర్ఎస్ కూటమిల దిష్టిబొమ్మలు సైతం దగ్దం చేస్తామని ఆయన తెలిపారు.