హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణలోని పట్టణాల్లో మహిళా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. సమాజంలో మహిళల శక్తిని, పాత్రను సెలబ్రేట్ చేసేలా పురపాలక శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించాలని, మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పురపాలక శాఖ ఉత్సవాల కార్యాచరణ ప్రకటించింది. మార్చి 8న మహిళా దినోత్సవం రోజు ప్రారంభమయ్యే వారోత్సవాల్లో క్రీడా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళలకు హెల్త్ క్యాంపుల నిర్వహణ, వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మహిళలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సన్మానం వంటి ప్రోగ్రామ్స్ఉంటాయి.
పురపాలక శాఖ కార్యక్రమాల్లో కీలకపాత్ర వహించే, వివిధ హోదాల్లో ప్రాతినిథ్యం వహిస్తున్న మహిళా ప్రజా ప్రతినిధులు, పురపాలక శాఖ సిబ్బంది, స్వయం సహాయక సంఘాల సభ్యులు, పారిశుద్ధ్య కార్మికులు, వివిధ ఎన్జీవోల సిబ్బందితో వారోత్సవాలను నిర్వహించనున్నట్లు పురపాలక శాఖ తెలిపింది. పురపాలికల్లో డ్రై కంపోస్ట్, కిచెన్ కాంపోస్టింగ్, నీటి సంరక్షణ లాంటి ఆదర్శవంతమైన పద్ధతుల్లో ముందుకెళ్తున్న పురపాలికల సిబ్బంది లేదా పట్టణంలోని మహిళలను ప్రత్యేకంగా గుర్తించి వారిని సన్మానించాలని మంత్రి కేటీఆర్సూచించారు. మహిళ స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో తయారైన ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాల క్యాంపులు నిర్వహించాలన్నారు.
కంటి వెలుగు ద్వారా పురపాలక శాఖలోని మహిళా ఉద్యోగులందరికీ ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపారు. మహిళల ఆరోగ్య సంరక్షణ, సాధికారికత వంటి అంశాలపై ప్రత్యేక సమావేశాలు, చర్చాగోష్టులను నిర్వహించి మరింత అవగాహన పెంచేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. వారం పాటు జరిగే ఈ సంబరాలు వివిధ శాఖలో పనిచేస్తున్న ఉన్నతాధికారులను, విభాగాధిపతులను, మహిళా జిల్లా కలెక్టర్లను, పోలీస్ ఉన్నతాధికారులు, మహిళా జడ్జీల వంటి వారిని ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించి కార్యక్రమాలను నిర్వహించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని పురపాలక శాఖ అధికారులకు మంత్రి కేటీఆర్ సూచించారు.
