విమెన్స్ వరల్డ్ కప్: ఇంగ్లండ్‌‌ హ్యాట్రిక్‌ విజయాలు‌.. శ్రీలంకపై గెలుపుతో టాప్ ప్లేస్ లోకి

విమెన్స్ వరల్డ్ కప్: ఇంగ్లండ్‌‌ హ్యాట్రిక్‌ విజయాలు‌.. శ్రీలంకపై  గెలుపుతో టాప్ ప్లేస్ లోకి

కొలంబో: బ్యాటింగ్‌‌లో దుమ్మురేపిన ఇంగ్లండ్‌‌.. విమెన్స్‌‌ వరల్డ్‌‌ కప్‌‌లో హ్యాట్రిక్‌‌ విజయాలను అందుకుంది. సివర్‌‌ బ్రంట్‌‌ (117) రికార్డు స్థాయిలో ఐదో వరల్డ్‌‌ కప్‌‌ సెంచరీ చేయడంతో శనివారం (అక్టోబర్ 11) జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో ఇంగ్లండ్‌‌ 89 రన్స్‌‌ తేడాతో శ్రీలంకపై గెలిచింది. ఫలితంగా ఆరు పాయింట్లతో టాప్‌‌ ప్లేస్‌‌లోకి దూసుకొచ్చింది. 

టాస్‌‌ ఓడిన ఇంగ్లండ్‌‌ 50 ఓవర్లలో 253/9 స్కోరు చేసింది. 24 రన్స్‌‌కే అమీ జోన్స్‌‌ (11), ట్యామీ బ్యూమెంట్‌‌ (32) ఔటైనా.. హీథర్‌‌ నైట్‌‌ (29)తో కలిసి సివర్‌‌ బ్రంట్‌‌ మూడో వికెట్‌‌కు 60 రన్స్‌‌ జోడించింది. సోఫియా డంక్లే (18), ఎమ్మా లాంబ్‌‌ (13), అలైస్‌‌ క్యాప్సీ (0), చార్లీ డీన్‌‌ (19), సోఫియా ఎకెల్‌‌స్టోన్‌‌ (3) నిరాశపర్చారు. ఇనోకా రణవీర 3, ప్రభోదిని, సుగంధికా చెరో రెండు వికెట్లు తీశారు. 

తర్వాత లంక 45.4 ఓవర్లలో 164 రన్స్‌‌కే ఆలౌటైంది. హాసిని పెరీరా (35) టాప్‌‌ స్కోరర్‌‌. ఇంగ్లిష్‌‌ బౌలర్లు ఎకెల్‌‌స్టోన్‌‌ (4/17), సివర్‌‌ బ్రంట్‌‌ (2/25), చార్లీ డీన్‌‌ (2/47) దెబ్బకు లంక బ్యాటింగ్‌‌ లైనప్‌‌ కుదేలైంది. హర్షిత సమరవిక్రమ (33), నీలాక్షిక సిల్వా (23), చామిరి ఆటపట్టు (15) పోరాడి విఫలమయ్యారు. బ్రంట్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది.