తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాల్లో గెలుస్తం: మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాల్లో  గెలుస్తం:  మంత్రి శ్రీధర్ బాబు

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో  తెలంగాణలోని 17 స్థానాలకు గానూ 17 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తు్ందని మంత్రి శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు.  రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని జేపీఎల్ కన్వెన్షన్ లో  నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.  అధికారంలోకి వచ్చిన  100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పామని.. అందులో ఇప్పటికే రెండు అమలు చేశామని చెప్పారు.  త్వరలో 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, 500 రూపాయలకే గ్యాస్  సిలిండర్ పథకాలు అమలు చేస్తామన్నారు. అంతేకాకుండా ఆటో డ్రైవర్ల కు రూ. 12 వేలు  ఇస్తామని తెలిపారు.  

బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఇచ్చినవి ఎన్ని అమలు చేసిందో చెప్పాలన్నారు మంత్రి శ్రీధర్ బాబు .  బీఆర్ఎస్  హయాంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని..  పేద వారికి ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్  అధికారంలోకి వచ్చాక  ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు వేస్తున్నామని..  మీరు ఎప్పుడైనా అలా వేశారా అని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు.  అభివృద్ధి కాంక్షించి, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పాటుపడే వారిని పార్టీ లోకి ఆహ్వానిస్తుమని చెప్పారు శ్రీధర్ బాబు.  త్వరలో  గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో ఇందిరమ్మ కమిటీలు వేస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు.  అందులో పది సంవత్సరాలుగా కష్టపడ్డ కార్యకర్తలకు చోటు కల్పిస్తామని..   కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు.