ఎన్నికల ఫలితాలు ఎప్పటికీ తెలియకపోవచ్చు

ఎన్నికల ఫలితాలు ఎప్పటికీ తెలియకపోవచ్చు

మెయిల్ ఇన్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై అసహనం
వాషింగ్టన్: వచ్చే నవంబర్‌‌ 3న జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను గుర్తించడానికి కొన్ని వారాలు లేదా నెలలు పట్టొచ్చని ప్రెసిడెంట్ ట్రంప్ హెచ్చరించారు. మెయిల్ ఇన్‌ బ్యాలెట్స్ వల్ల పోస్ట్ ఆఫీస్‌లు, లోకల్ ఎలక్షన్ బాడీస్‌పై పెను భారం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సంప్రదాయ ఎన్నికల తీర్పు చాలా ఆలస్యమవ్వొచ్చునన్నారు. ‘నవంబర్ 3న ఎన్నికల లెక్కింపు ఉండదు. నా అభిప్రాయం ప్రకారం.. ఈ సీజన్ ముగిసే వరకు మీకు ఫలితాలు తెలియకపోవచ్చు. కొన్ని వారాలు, నెలలు, లేదా మొత్తానికే తెలియకపోవచ్చు’ అని ట్రంప్ చెప్పారు.

కరోనా వ్యాప్తి భయంతో అమెరికా ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో దాదాపు 50 మిలియన్ ఓట్లు మెయిల్‌ ద్వారా వేసే అవకాశం ఉందని సమాచారం. ఈ ప్రక్రియలో ఓట్ల లెక్కింపు చాలా ఆలస్యమవుతుందని ట్రంప్‌తోపాటు కొందరు నిపుణులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. డెమొక్రాట్ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ ఫలితాలను తారుమారు చేయాలనే కుట్రలో యూనివర్సల్ మెయిల్ ఇన్ ఓటింగ్‌ను ప్రమోట్ చేస్తున్నారని ట్రంప్ దుయ్యబట్టారు. ‘మేం దీనికి సిద్ధంగా లేం. 51 మిలియన్ బ్యాలెట్స్‌. ఇది దేశానికి తీవ్ర ఇబ్బంది కలిగించే అంశం. ప్రజాస్వామ్యానికి ఇది తీవ్ర సమస్య’ అని ట్రంప్ మండిపడ్డారు.