ఈసారి భయం ఎలా ఉంటుందో చూపిస్తాం: ఒక్క టెర్రరిస్ట్‎ను కూడా వదిలిపెట్టం: అమిత్ షా వార్నింగ్

ఈసారి భయం ఎలా ఉంటుందో చూపిస్తాం: ఒక్క టెర్రరిస్ట్‎ను కూడా వదిలిపెట్టం: అమిత్ షా వార్నింగ్

న్యూఢిల్లీ: పహల్గామ్‎లో దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రదాడికి పాల్పడిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని.. ఇది మోడీ సర్కార్ అనే విషయం వారు గుర్తుంచుకోవాలని హాట్ కామెంట్స్ చేశారు. ఈసారి భయం ఎలా ఉంటుందో చూపిస్తామని తీవ్రంగా హెచ్చరించారు. గురువారం (మే 1) న్యూఢిల్లీలో బోడోఫా ఉపేంద్రనాథ్ బ్రహ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరై అమిత్ షా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అస్సాంలోని బోడో సమాజ అభ్యున్నతి, పురోగతికి తన జీవితాన్ని అంకితం చేసిన ఉపేంద్రనాథ్ బ్రహ్మ చిరకాలం ప్రజల్లో గుండెల్లో ఉంటారన్నారు. 

Also Read : భయపడిన పాకిస్తాన్: లాహోర్, కరాచీ ఎయిర్ స్పేస్ మూసివేత

అనంతరం.. పహల్గాం టెర్రర్ ఎటాక్‎పై బహిరంగంగా తొలిసారి అమిత్ షా స్పందించారు. పహల్గాం దాడికి పాల్పడ్డ టెర్రరిస్టులను వదిలిపెట్టమని.. ఎక్కడున్నా వెంటాడి వేటాడుతామని హెచ్చరించారు. ‘‘పహల్గాం ఉగ్రదాడి ఒక పిరికిపంద చర్య. దాన్నో విజయంగా భావించే వాళ్లు గుర్తుంచుకోండి. ఇది నరేంద్ర మోడీ సర్కార్. దాడికి పాల్పడ్డ ఒక్కరినీ కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు’’ మాస్ వార్నింగ్ ఇచ్చారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నేను నివాళులు అర్పిస్తున్నాను. 

ఇది వారి కుటుంబాల దుఃఖం మాత్రమే కాదు. యావత్ దేశం అనుభవించిన దుఃఖం. ప్రధాని మోడీ నాయకత్వంలో భారతదేశం ఉగ్రవాదం పట్ల కఠినమైన జీరో-టాలరెన్స్ వైఖరిని కొనసాగిస్తుందని నేను అందరికీ మీ హామీ ఇస్తున్నా. నేరస్థులు తాము గెలిచామని నమ్మితే అది వారి పొరపాటే. ప్రతి దాడికి మేము ప్రతీకారం తీర్చుకుంటాము. దేశంలోని ఏ ప్రాంతంలోనూ ఉగ్రవాదం మనుగడ సాగించడానికి అనుమతించం. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో నిర్మూలిస్తాం. ఉగ్రవాదంపై పోరాటంలో ప్రపంచ భారత్‎కు అండగా నిలుస్తోంది.