భయపడిన పాకిస్తాన్: లాహోర్, కరాచీ ఎయిర్ స్పేస్ మూసివేత

భయపడిన పాకిస్తాన్: లాహోర్, కరాచీ ఎయిర్ స్పేస్ మూసివేత

ఇస్లామాబాద్: భారత్ ఏ క్షణమైనా దాడి చేయొచ్చన్న భయంతో వణికిపోతుంది పాకిస్తాన్. 36 గంటల్లో ఇండియా యుద్ధం చేస్తుందంటూ.. పాకిస్తాన్ భయపడుతోంది. ఇప్పటికే పాక్ మంత్రి ఈ విషయాన్ని బహిరంగంగానే ప్రకటించారు. ఈ క్రమంలోనే.. ఇండియా యుద్ధానికి వస్తుందన్న భయంతో.. దేశంలోని లాహోర్, కరాచీ ఎయిర్ పోర్టులకు సంబంధించి ఎయిర్ స్పేస్‎లను మూసివేసింది.

పహల్గాం ఉగ్రదాడి అనంతరం దాయాది పాక్‎ దేశానికి భయం పట్టుకుంది. భారత్ ఏ క్షణాన దాడి చేసి ప్రతీకారం తీర్చుకుంటోందనని ఆందోళన నెలకొంది. భారత్‎తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాక్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్‎లో ప్రధాన నగరాలైన కరాచీ, లాహోర్‌లోని కొన్ని ప్రాంతాలలో 2025, మే 31 వరకు తన గగనతలాన్ని మూసివేసింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ నిషేధం అమల్లో ఉండనుంది. 

దేశ భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, సాధారణ విమాన కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం ఉండదని.. సాధారణ విమానాలు యధావిధిగా  కొనసాగుతాయని తెలిపింది. వాణిజ్య విమాన కార్యకలాపాలు మాత్రం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కొనసాగుతాయని పేర్కొంది. భారత్ దాడి చేస్తుందని భయంతోనే కరాచీ, లాహోర్‌లో పాక్ ఎయిర్ స్పేస్ క్లోజ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. 

Also Read : ఈసారి భయం ఎలా ఉంటుందో చూపిస్తాం

పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు 2025, ఏప్రిల్ 22న జమ్ము కాశ్మీర్ లోని పహల్గాంలో నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. ఉగ్రమూకల కాల్పుల్లో 26 మంది టూరిస్టులు అక్కడికక్కడే మరణించారు. ఈ దాడిపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న భారత్.. పాక్‎పై పలు ఆంక్షలు విధించింది. సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో పాటు పాక్ పౌరుల అన్ని రకాల వీసాలను రద్దు చేసింది. దీంతో పాక్ కూడా ప్రతీకార చర్యలకు దిగింది. సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో పాటు భారత విమానాలకు పాక్ తన ఎయిర్ స్పేస్‎ను క్లోజ్ చేసింది. 

దీనికి కౌంటర్‎గా పాకిస్తాన్ యాజమాన్యంలో నిర్వహించబడుతున్న, ఆ దేశం లీజుకు తీసుకున్న పౌర, సైనిక విమానాల కోసం తన వైమానిక ప్రాంతాన్ని మూసివేస్తున్నట్లు బుధవారం (ఏప్రిల్ 30) భారత్ ప్రకటించింది. ఈ మేరకు నోటమ్ నోటీసు జారీ చేసింది. 2025, ఏప్రిల్ 30 నుంచి మే 23, 2025 వరకు అమల్లో ఉంటుదని తెలిపింది. భారత్ ఈ నిర్ణయం తీసుకున్న కొన్ని గంటల్లోనే పాక్ కరాచీ, లాహోర్ ఎయిర్ స్పేస్ ను క్లోజ్ చేసుకోవడంతో ఏం జరగబోతుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.