- మొన్నటివరకు వానలు, ఇసుక కొరతతో స్తంభించిన పనులు
- 7,366 ఇండ్లు గ్రౌండింగ్.. త్వరలోనే మిగతావి ప్రారంభం
- లబ్ధిదారులకు వివిధ దశల్లో రూ.61.47 కోట్ల బిల్లులు చెల్లింపు
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు స్పీడ్ అందుకున్నాయి. మొన్నటివరకు భారీ వర్షాలు, వరదలతో పనులు స్తంభించిపోగా.. పలుచోట్ల ఇసుక కొరత వల్ల ఆటంకాలు ఎదురయ్యాయి. ఇటీవల వానలు తగ్గడంతో పనులు వేగవంతం చేస్తున్నారు.
లబ్ధిదారులకు క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలుంటే సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం వెంటవెంటనే బిల్లులు మంజూరు చేస్తుండడంతో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
జిల్లాకు 10,744 ఇండ్లు
జిల్లాలో మూడు నియోజకవర్గాలు ఉండగా.. ఒక్కో సెగ్మెంట్‌కు 3,500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇవిగాకుండా ఖానాపూర్ నియోజకవర్గం పరిధిలోని జన్నారం మండలానికి అదనంగా ఇండ్లు ఇచ్చింది. జిల్లావ్యాప్తంగా మొత్తం 10,744 ఇండ్లు సాంక్షన్ చేసింది. వీటిలో ఇప్పటివరకు 7,366 ఇండ్లు గ్రౌండింగ్‌చేశారు. ఇందులో 4,826 బేస్మెంట్ లెవల్, 1.540 రూఫ్ లెవల్, 569 స్లాబ్ లెవల్‌కు చేరుకున్నాయి. వివిధ దశల్లో కొనసాగుతున్న పనులను స్పీడప్ చేయడంతో పాటు మిగతా ఇండ్లను వెంటనే గ్రౌండింగ్చేసి నిర్మాణాలు ప్రారంభించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటివరకు నలుగురు లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణాలు పూర్తిచేసుకొని గృహ ప్రవేశాలు చేశారు.
వెనువెంటనే బిల్లుల చెల్లింపు
ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ.5లక్షలు ఇస్తోంది. జిల్లాలో 10,744 ఇండ్లను రూ.537.20 కోట్లతో నిర్మిస్తోంది. బేస్మెంట్, రూఫ్, స్లాబ్ లెవల్స్‌తో పాటు నిర్మాణాలు పూర్తికాగానే మొత్తం బిల్లులు చెల్లిస్తోంది. జిల్లాలో ఇప్పటివరకు రూ.61.47 కోట్ల బిల్లులు సాంక్షన్అయ్యాయి. లబ్ధిదారులు 600 స్క్వేర్ ఫీట్లకు మించకుండా ఇండ్లు నిర్మించుకోవాలి. కానీ కొంత మంది అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో కట్టుకోవడం, ఆధార్ నంబర్, బ్యాంక్అకౌంట్ఆన్లైన్ పోర్టల్‌లో తప్పుగా నమోదు చేయడం తదితర కారణాలతో కొందరికి బిల్స్ రాలేదని చెప్తున్నారు. అలాంటివి తమ దృష్టికి తీసుకొస్తే వెంటనే సవరించి సకాలంలో బిల్లులు మంజూరయ్యేలా చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు.
క్షేత్రస్థాయిలో సమస్యలివీ..
ఆర్థిక సమస్యల కారణంగా పలువురు లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించలేదు. వీరికి డీఆర్డీఏ ద్వారా లోన్లు మంజూరు చేసి బిల్లు రాగానే లోన్డబ్బులు రివకరీ చేసుకునేలా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కానీ జిల్లాలో లోన్ల కోసం దరఖాస్తు చేసుకోవడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఇటీవల స్టీల్, సిమెంట్, ఇసుక, ఇటుకతో పాటు ఇతర మెటీరియల్ రేట్లుపెరగడంతో ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షల కంటే ఎక్కువ ఖర్చు అవుతోందని లబ్ధిదారులు చెబుతున్నారు. మేస్ర్తీలు, లేబర్కొరత వల్ల ఇండ్ల నిర్మాణాలు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదంటున్నారు. అలాగే వివిధ దశల్లో ఫొటోలను ఆన్లైన్ పోర్టల్‌లో అప్లోడ్ చేయడానికి పంచాయతీ సెక్రటరీలు, బిల్స్మంజూరు చేయడానికి హౌసింగ్ సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సొంతింటి కల నెరవేరింది
ఎన్నో ఏండ్ల నుంచి ఉమ్మడి కుటుంబంలో ఇరుకు గదుల్లో ఉంటున్నాం. ఆర్థిక స్తోమత లేక ఇల్లు కట్టుకోలేకపోయాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో నిర్మాణ పనులు మొదలుపెట్టినం. ఐదు నెలల్లో ఇల్లు పూర్తయ్యింది. ఇప్పటివరకు రూ.4 లక్షలు బ్యాంక్ ఖాతాలో జమయ్యాయి. ఇంకో రూ.లక్ష బిల్లు రావాల్సి ఉంది. ఇల్లు మంచిగా ఉండాలని మరో రూ.3 లక్షలు అప్పు చేసి కట్టుకున్నాం. కాంగ్రెస్ సర్కారు పుణ్యమాని సొంతింటి కల నెరవేరింది.-జనంపల్లి స్నేహ, గంగిపల్లి, జైపూర్ మండల
ప్రభుత్వానికి రుణపడి ఉంటాం
నాకు ఇందిరమ్మ ఇల్లు సాంక్షన్ అయ్యింది. ఏప్రిల్‌లో ముగ్గు పోసి పనులు స్టార్ట్ చేసినం. ఇటీవలే పనులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు రూ.4 లక్షలు బ్యాంకు అకౌంట్లో పడ్డాయి. మిగతా రూ.లక్ష త్వరలోనే వస్తాయని అధికారులు చెప్పిన్రు. మొత్తం రూ.8 లక్షలతో ఇల్లు కట్టుకున్నం. సుతారీలు, కూలీల రేట్లు, సిమెంటు, కంకర, రాడ్డు, ఇసుక, మట్టి రేట్లు పిరంగా ఉన్నాయి. వీటికే ఎక్కువ ఖర్చు అవుతోంది. ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన కూడా లేని మాకు ఇల్లు ఇచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. -కురిమిండ్ల లక్ష్మి, పొక్కూరు, చెన్నూర్మండలం
