‘సమ్మక్క’ డీపీఆర్పై కసరత్తు..ఎస్సారెస్పీ స్టేజ్-2, రామప్ప, పాకాల ఆయకట్టును చేర్చే యోచన

‘సమ్మక్క’ డీపీఆర్పై కసరత్తు..ఎస్సారెస్పీ స్టేజ్-2, రామప్ప, పాకాల ఆయకట్టును చేర్చే యోచన
  • చత్తీస్ గఢ్​ఎన్​వోసీ కోసం అధికారుల ప్రయత్నాలు
  • ఆ రాష్ట్రంతో మరోసారి చర్చలకు ఏర్పాట్లు

హైదరాబాద్, వెలుగు: సమ్మక్క సాగర్​ప్రాజెక్టు అనుమతుల విషయంలో సర్కారు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నది. ఆయకట్టును పూర్తిగా చూపించలేదని పేర్కొంటూ కొద్దిరోజుల క్రితం సెంట్రల్​వాటర్​కమిషన్​(సీడబ్ల్యూసీ) ప్రాజెక్టు డీపీఆర్​ను తిప్పిపంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మళ్లీ ఎక్కడా లోపాలు లేకుండా చూసుకుంటూ రివైజ్డ్​డీపీఆర్​ను సమర్పించేందుకు ఇరిగేషన్​అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఆయకట్టు వివరాలను అప్​డేట్​చేయనున్నారు.

 శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (ఎస్సారెస్పీ) స్టేజీ–2 కింద ఉన్న 4.40 లక్షల ఎకరాలకు సాగునీరు స్థిరీకరించడంతోపాటు రామప్ప–పాకాల లింక్ ద్వారా మరో 30 వేల ఎకరాల ఆయకట్టును డీపీఆర్​లో చేర్చి ఇరిగేషన్​ శాఖ సెంట్రల్​డిజైన్స్​ఆర్గనైజేషన్​(సీడీవో)తో సర్టిఫై చేయించాలని యోచిస్తున్నారు. ఈ క్రమంలో అన్ని టెక్నికల్​అంశాలను పరిశీలిస్తున్నారు. దీనిపై ఇప్పటికే ఇరిగేషన్​శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. వీలైనంత త్వరగా మళ్లీ డీపీఆర్​ను అప్రైజల్​కు పంపేలా ప్రయత్నిస్తున్నారు. 

చత్తీస్‌‌గఢ్ ఎన్వోసీపైనా వేగం..  

మరోవైపు సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు పొరుగు రాష్ట్రమైన చత్తీస్‌‌గఢ్ నుంచి నో అబ్జెక్షన్​సర్టిఫికెట్​ (ఎన్వోసీ)ని సాధించేందుకు చర్యలు వేగవంతం చేయనున్నారు. అవసరమైతే మరోసారి ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలన్న యోచనలోనూ ఉన్నట్టు సమాచారం. బ్యారేజీలో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తే చత్తీస్‌‌గఢ్‌‌లోని బీజాపూర్ జిల్లా పరిధిలో బ్యాక్‌‌వాటర్ వల్ల కొంత భూభాగం ముంపునకు గురవుతుంది. ముంపు నిర్ధారణ కోసం చత్తీస్‌‌గఢ్ జలవనరుల విభాగానికి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నిధులు చెల్లించి జాయింట్​సర్వేను కూడా పూర్తి చేయించింది.

 ముంపునకు గురయ్యే భూములు, ఆస్తులకు తగిన పరిహారం, పునరావాస వ్యయాన్ని భరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇప్పటికే వెల్లడించింది. దీనిపై మూడుసార్లు ఆ రాష్ట్ర సీఎం విష్ణుదేవ్​సాయ్​తో మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి భేటీ అయ్యారు. కానీ ఇంతవరకు ఆ రాష్ట్రం నుంచి మళ్లీ ఎలాంటి సమాచారం రాలేదు. ఇటు చత్తీస్​గఢ్​ నుంచి ఎన్వోసీ వస్తేనే అనుమతులు ఇస్తామని సీడబ్ల్యూసీ చెప్పడంతో.. ఇప్పుడు ఆ పని కూడా అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే వీలైనంత త్వరగా ఎన్వోసీని సాధించేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.