పార్టీ పటిష్ఠత కోసం కార్యకర్తలు పనిచేయాలె : బండి సంజయ్

పార్టీ పటిష్ఠత కోసం కార్యకర్తలు పనిచేయాలె : బండి సంజయ్

భైంసా/నర్సాపూర్(జి),వెలుగు: ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బీజేపీ స్టేట్​చీఫ్ బండి సంజయ్ శనివారం రాంపూర్​మీదుగా గుండంపల్లి ఎక్స్ రోడ్, దిలావర్​పూర్, లోలం, సిర్గాపూర్​వరకు 12 కిలో మీటర్లు నడిచారు. రాంపూర్​నుంచి లోలం వరకు బండి సంజయ్​పాదయాత్రలో యూత్​పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రోడ్డు వెంట రైతులు, వ్యవసాయ కూలీలతో బండి సంజయ్ మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. గుండంపల్లి, దిలావర్​పూర్ వద్ద పంట చేలలోకి వెళ్లి రైతులతో కలిసి విత్తనాలు చల్లారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇస్తున్న సంక్షేమ పథకాలు వివరించారు. స్థానిక గవర్నమెంట్​హైస్కూల్​ను సందర్శించారు. విద్యార్థులతో చాలాసేపు మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం చారిత్రక ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేశారు. దారిపొడువునా మహిళలు, యువకులు బండి సంజయ్​తో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. పాదయాత్రలో భారత్ మాతాకీ జై..  జై శ్రీరాం, రామలక్ష్మణ జానకీ.. జైబోలో హనుమాన్​ కీ నినాదాలు మారుమోగాయి.

నిర్మల్, మంచిర్యాల లీడర్లతో మీటింగ్​...

రాంపూర్ క్యాంపు వద్ద బండి సంజయ్ నిర్మల్, మంచిర్యాల జిల్లాల బీజేపీ లీడర్లు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఇదే ఉత్సాహం నిరంతరం కొనసాగాలని సూచించారు. పార్టీ పటిష్ఠత కోసం కార్యకర్తలు పనిచేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్​ఎవరికి వచ్చినా కలిసికట్టుగా పనిచేయాలని సూచించినట్లు సమాచారం. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రాగానే కార్యకర్తలందరికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్​ రెడ్డి, ఎంపీ సోయం బాపూరావు,  యాత్ర సహ ప్రముఖ్ వీరేందర్​గౌడ్, రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప, జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, పెద్దపల్లి జిల్లా ఇన్​చార్జి రావుల రాంనాథ్, ఆదిలాబాద్ పార్లమెంట్​కన్వీనర్​ అయ్యన్నగారి భూమయ్య, సీనియర్ లీడర్​మల్లికార్జున్​రెడ్డి, అప్పాల గణేశ్​చక్రవర్తి, మెడిసెమ్మ రాజు, కరిపెల్లి గంగాధర్, మురళి, అంజుకుమార్​రెడ్డి, నరేందర్, జానుబాయి, అలివెలు తదితరులు పాల్గొన్నారు.