కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ వద్ద పెను ప్రమాదం తప్పింది. పెద్దవాగుపై కొత్తగా నిర్మిస్తున్న రైల్వే బ్రిడ్జి పనుల్లో అపశృతి చోటుచేసుకుంది.పెద్దవాగుపై మూడో రైల్వే లైన్ నిర్మాణం కోసం రైల్వే అధికారులు కొత్త వంతెనను నిర్మిస్తున్నారు. అయితే నిర్మాణ పనులు జరుగుతుండగా ఒక్కసారిగా ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఒక కార్మికుడు శిథిలాల కింద ఇరుక్కుపోయాడు.
స్థానికులు , తోటి కార్మికుల సాయంతో క్షతగాత్రులను బయటకు తీసి, వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి రైల్వే కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమని తోటి కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే తమ ప్రాణాల మీదకు వచ్చిందని వారు ఆవేదన చెందుతున్నారు. నిర్మాణ పనుల్లో భద్రతా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని స్థానికులు సైతం ఆరోపిస్తున్నారు.
